ఓటీటీలోకి వచ్చేస్తోన్న పాప్ కింగ్ బయోపిక్ ‘మైఖేల్’!

ఇండియాలోని మైఖేల్ జాక్సన్ అభిమానుల కోసం ఈ చిత్రం వచ్చే వారం నుండే ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Srinivas Rao
Published on: 2 Jun 2026 9:28 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తోన్న పాప్ కింగ్ బయోపిక్ ‘మైఖేల్’!
X

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక బయోపిక్ ‘మైఖేల్’. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. వరల్డ్ ప్రీమియర్ సమయంలో విమర్శకుల నుండి కాస్త నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. థియేటర్లలో రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఏకంగా $850 మిలియన్లు (సుమారు ₹7,000 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లను సాధించి ఈ బయోపిక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఇప్పుడు ఇండియాలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

జూన్ 9 నుండి ఓటీటీలోకి.. మొదట రెంట్ బేసిస్‌లోనే!

ఇండియాలోని మైఖేల్ జాక్సన్ అభిమానుల కోసం ఈ చిత్రం వచ్చే వారం నుండే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. జూన్ 9, 2026 నుండి ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ‘బుక్ మై షో స్ట్రీమ్’ (BookMyShow Stream) లో ఈ సినిమా డిజిటల్ కాపీ స్ట్రీమింగ్ కాబోతోంది.

బుక్ మై షో స్ట్రీమ్‌లో ఈ చిత్రం ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియోలోనూ అందుబాటులో ఉంటుంది. అయితే, మొదటగా ఈ సినిమాను కేవలం రెంట్ (అద్దె) చెల్లించి చూసే పద్ధతిలోనే రిలీజ్ చేస్తున్నారు. బుక్ మై షో స్ట్రీమ్‌తో పాటే అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ లలో కూడా రెంట్ బేసిస్‌లోనే ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఆకట్టుకున్న జాఫర్ జాక్సన్.. అంతటా పాప్ క్రేజ్!

మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్ ప్లే చేశారు. మైఖేల్ బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూమెంట్స్‌ను ఆయన అద్భుతంగా పండించారనే ప్రశంసలు దక్కాయి. ప్రముఖ దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ హై-ప్రొఫైల్ డ్రామాను ఎమోషనల్‌గా తెరకెక్కించగా.. నియా లాంగ్, జూలియానో వాల్డి, కీలిన్ డ్యూరెల్ జోన్స్ కీలక పాత్రల్లో మెరిశారు. లియోర్ రోస్నర్ అందించిన గ్రాండ్ మ్యూజికల్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

రెంట్ విధానం కాకుండా, అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చే నార్మల్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్స్ కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. పాప్ లెజెండ్ కథను హోమ్ స్క్రీన్స్‌పై వీక్షించాలనుకునే వారు జూన్ 9న బుక్ మై షో స్ట్రీమ్‌లో లాగిన్ అయిపోవచ్చు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story