My Brilliant Career Review : పెళ్లా? కెరీరా?.. పీరియడ్ డ్రామాకు నయా ఫెమినిస్ట్ టచ్.!
My Brilliant Career Review : ఆస్ట్రేలియన్ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవలల్లో ఒకటైన 'మై బ్రిలియంట్ కెరీర్' (My Brilliant Career) ఆధారంగా రూపొందిన
my-brilliant-career-season-1
My Brilliant Career Review : ఆస్ట్రేలియన్ సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవలల్లో ఒకటైన 'మై బ్రిలియంట్ కెరీర్' (My Brilliant Career) ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 1901లో రచయిత్రి మైల్స్ ఫ్రాంక్లిన్ రాసిన ఈ క్లాసిక్ నవల వెలువడి దాదాపు 125 ఏళ్లు కావస్తోంది. అలాగే దీని ఆధారంగా వచ్చిన సినిమా వచ్చి కూడా నాలుగు పదుల కాలం దాటింది. అయితే, దర్శకులు అలెస్సా మెక్‌క్లెలాండ్, యాన్ రెంటన్‌లు ఈ కథకు నేటి తరానికి సరిపోయేలా నయా లుక్, గ్లామర్, ఫెమినిస్ట్ టచ్ ఇచ్చి 6 ఎపిసోడ్ల సిరీస్‌గా మలిచారు. క్లాసిక్ పీరియడ్ డ్రామాగా సాగే ఈ సిరీస్ కథేంటి? ప్రేక్షకులను ఏమేర అలరించిందో సమగ్రంగా చూద్దాం.
కథేంటి?
1900ల కాలం నాటి ఆస్ట్రేలియన్ సమాజం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 'పోసమ్ గల్లీ' అనే గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో బతుకుతున్న కుటుంబానికి చెందిన తిరుగుబాటు మనస్తత్వం ఉన్న అమ్మాయి సిబిల్లా మెల్విన్ (ఫిలిప్పా నార్త్‌ఈస్ట్). సమాజం ఏమనుకున్నా సరే, తన కాళ్లపై తాను నిలబడి ఒక గొప్ప రచయిత్రిగా ఎదగాలనేది ఆమె ఏకైక ఆశయం. అయితే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె కుటుంబం, సిబిల్లాను క్రమశిక్షణ గల పద్ధతిగల మహిళగా మార్చేందుకు ఆమె ధనవంతురాలైన నానమ్మ శ్రీమతి బోసియర్ (అన్నా ఛాన్సలర్) వద్దకు పంపుతుంది. ఏదైనా పెద్ద ధనిక కుటుంబంలోకి కోడలిగా పంపించి తమ అప్పులను తీర్చవచ్చని ఆమె కుటుంబం ఆశిస్తుంది.
అక్కడికి వెళ్లిన తర్వాత సిబిల్లా జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆస్తిపరుడైన పొరుగు భూస్వామి హ్యారీ బీచమ్ (క్రిస్టోఫర్ చుంగ్), అలాగే ఫ్రాంక్ హాడెన్ (జేక్ డన్)ల పరిచయంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. పురుషాధిక్య సమాజం విధించే కట్టుబాట్లను ఎదుర్కొంటూ, పిల్లలను కనే యంత్రంలా మారడం కంటే ఏదైనా సృష్టించే రచయిత్రిగా మారడమే తన లక్ష్యమని భావించే సిబిల్లా.. తన ప్రేమ, పెళ్లి ఒత్తిళ్లు, సొంత కలల మధ్య ఎలా ప్రయాణించింది అనేదే ఈ సిరీస్ సారాంశం.
సిరీస్ ఎలా ఉందంటే?
పీరియడ్ డ్రామా ప్రియులను ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆకట్టుకుంటుంది. కథ ప్రారంభంలోనే ఒక పాతకాలపు వేదికపై కథానాయకి ఒక విప్లవాత్మకమైన కవితను చదివి, తన ఒంటిపై ఉన్న బిగుతు దుస్తులను విప్పేసి కొలనులోకి దూకే సీన్‌తోనే సిరీస్ టోన్ ఏంటో దర్శకులు స్పష్టం చేశారు. పాతకాలపు సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ వాడుతూనే, దానికి మోడర్న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సమకాలీన ఆలోచనలను జత చేయడం ఈ సిరీస్ అతిపెద్ద ప్లస్ పాయింట్.
కేవలం సిబిల్లా కథ మాత్రమే కాకుండా, ఆమె అత్త హెలెన్ (జెనెవీవ్ ఓరైల్లీ), బాబాయి జూలియస్ (అలెగ్జాండర్ ఇంగ్లాండ్) వంటి పాత్రల ద్వారా ఆ కాలంలో ఉన్న రేసిజం, హోమోఫోబియా, మహిళల పట్ల వివక్ష వంటి సామాజిక అంశాలను కూడా చాలా సహజంగా, కథకు ఆటంకం కలగకుండా చూపించారు. అయితే, సిరీస్ చివరి ఘట్టానికి వచ్చేసరికి కథనంలో వేగం కాస్త తగ్గి, ముగింపు అంత పకడ్బందీగా లేదనే భావన కలుగుతుంది.
నటీనటుల ప్రతిభ & సాంకేతిక వర్గం
సిబిల్లా పాత్రకు ఫిలిప్పా నార్త్‌ఈస్ట్ ప్రాణం పోశారు. ఒక మోటు గ్రామీణ అమ్మాయి నుంచి పద్ధతిగల మహిళగా మారే క్రమంలో కూడా తనలో ఉన్న పొగరు, తెలివితేటలు తగ్గకుండా ఆమె చూపించిన నటన ప్రశంసనీయం. హ్యారీ పాత్రలో నటించిన క్రిస్టోఫర్ చుంగ్, ఫిలిప్పాతో పంచుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ , వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. నానమ్మ పాత్రలో అన్నా ఛాన్సలర్ గాంభీర్యాన్ని ఒలికించగా, జేక్ డన్, కేట్ ముల్వానీ తమ సహాయ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సమకాలీన ఆలోచనలు, మనసును హత్తుకునే సంగీతం, పీరియడ్ డ్రామా వాతావరణం కలగలిసిన ‘మై బ్రిలియంట్ కెరీర్’ సీజన్ 1 మహిళా సాధికారతను చాటిచెప్పే ఒక మంచి వినోదాత్మక సిరీస్. నాణ్యమైన కంటెంట్‌ను కోరుకునే ఓటీటీ ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా ఒక మస్ట్ వాచ్ సిరీస్!




