Palla Burusu : ‘పళ్ల బురుసు’ వచ్చేసింది.. తండ్రీకొడుకుల కథ ఎలా ఉందంటే?

Palla Burusu : 'బలగం' సినిమాతో టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్. తెలంగాణ నేపథ్యంతో కూడిన కథల్లో

G Krishna
Published on: 2 Sept 2026 5:47 PM IST
palla burusu
X

palla burusu 

Palla Burusu : 'బలగం' సినిమాతో టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్. తెలంగాణ నేపథ్యంతో కూడిన కథల్లో వీరి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాంటి వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో, తండ్రీకొడుకులుగా నటించిన సరికొత్త చిత్రం 'పళ్ల బురుసు'. ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాగా, తాజాగా సెప్టెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూర్లో శంభూ (సుధాకర్ రెడ్డి) అనే వృద్ధ రైతు ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆయన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) ప్రభుత్వ ఉద్యోగి. కొడుకు తనను సరిగ్గా పట్టించుకోకపోవడంతో శంభూ తనకు ఉన్న ఒక ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటూ వేరుగా ఉంటాడు. ఈ క్రమంలో శంభూకి పంటి సమస్య రావడంతో డాక్టర్ సలహా మేరకు 'పళ్ల బురుసు' (టూత్ బ్రష్) వాడాలని అనుకుంటాడు. దానిని టౌన్ నుంచి తెచ్చిపెట్టమని కొడుకు తిరుపతిని అడుగుతాడు.

అయితే తిరుపతి తన కూతురు రేఖ పెళ్లి పనుల హడావుడిలో ఉండి తండ్రి మాటను అస్సలు పట్టించుకోడు. సరికాదా, పెళ్లికి తండ్రిని సరిగ్గా పిలవడు కూడా. అయినా సరే మనవరాలి పెళ్లికి శంభూ హాజరవుతాడు. కానీ, కొడుకు తనను ఇంతలా నిర్లక్ష్యం చేయడం మనసును తీవ్రంగా గాయపరచడంతో, శంభూ ఏకంగా కొడుకుపై కోర్టులో కేసు వేస్తాడు. మరోవైపు కూతురు పెళ్లి అప్పులు తీర్చడానికి తండ్రి పేరు మీద ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేయాలని తిరుపతి ప్లాన్ చేస్తాడు. తాను బతికుండగా పొలం అమ్మేది లేదని శంభూ తేల్చి చెబుతాడు. ఆ తర్వాత తండ్రీకొడుకుల మధ్య ఏం జరిగింది? శంభూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేదే మిగతా కథ.

కథనం, విశ్లేషణ

ఒక చిన్న 'పళ్ల బురుసు' చుట్టూ తిరిగే కథలా అనిపించినా, దీని వెనుక ఒక తండ్రి ఆవేదన దాగి ఉంటుంది. తండ్రికి టూత్ బ్రష్ కొనివ్వడం పెద్ద విషయమేమీ కాదు, వేరే ఎవరితోనైనా తెప్పించుకోవచ్చు. కానీ తన కొడుకు తన కోసం ఆ మాత్రం సమయం కేటాయిస్తాడా లేదా అనే ఆశే ఆ తండ్రి నిరీక్షణ. ఈ అంశాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దీనికి తోడు గ్రామీణ వాతావరణం, రచ్చబండ ముచ్చట్లు, ఊరిలోని లొకేషన్లు , ఒక కుర్ర జంట ప్రేమకథ కథను ముందుకు నడిపిస్తాయి.

నేటి సమాజంలో పిల్లలు ఎదిగిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో, అలాగే ఒకప్పుడు పల్లెల్లో ఉండే ఆప్యాయతలు స్మార్ట్‌ఫోన్ల సంస్కృతి వల్ల ఎలా తగ్గిపోతున్నాయో దర్శకుడు స్పృశించిన తీరు ఆలోచింపజేస్తుంది.

సాంకేతికత, నటీనటుల ప్రతిభ

సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తమ సహజ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అయితే సినిమాను కామెడీ టచ్‌తో నడిపించాలని చూసినా, అది పూర్తిగా పండకపోవడంతో కథ కాస్త సీరియస్‌గా మారినట్లు అనిపిస్తుంది. వినోదంపై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తాయి. పాటలు, వాటిలోని సాహిత్యం పల్లె అనుబంధాలను తడుతూ ఆకట్టుకుంటాయి.

వయసు మళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కోరుకునేది కేవలం ప్రేమ, ఆప్యాయత , గుర్తింపు మాత్రమే అనే చక్కని సందేశంతో ఈ సినిమా సాగుతుంది. కథనం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, పల్లెటూరి వాతావరణం , ఎమోషనల్ కంటెంట్‌ను కోరుకునే వారికి 'పళ్ల బురుసు' ఒక మంచి ఆప్షన్.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story