Pritam and Pedro Review: సైబర్ థ్రిల్లర్ అదిరింది.. సస్పెన్స్, కామెడీ.. రెండూ కావాలంటే ఇదే.!

Pritam and Pedro Review: ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కథ, స్క్రీన్‌ప్లే భాగస్వామ్యంలో, అవినాష్ అరుణ్ ధావరే దర్శకత్వంలో వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్

G Krishna
Published on: 3 July 2026 5:13 PM IST
pritam and pedro
X

pritam and pedro 

Pritam and Pedro Review: ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కథ, స్క్రీన్‌ప్లే భాగస్వామ్యంలో, అవినాష్ అరుణ్ ధావరే దర్శకత్వంలో వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’. అమిత్ దూబే రాసిన ‘హిడెన్ ఫైల్స్’, ‘రిటర్న్ ఆఫ్ ది ట్రోజన్ హార్స్’ పుస్తకాల ఆధారంగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం..

కథా నేపథ్యం

కథ ఉత్తర గోవాలో నివసించే ప్రీతమ్ పార్కర్ (వీర్ హిరానీ) చుట్టూ తిరుగుతుంది. ప్రీతమ్ తాతగారి (వినోద్ నాగ్‌పాల్) వద్ద ఉన్న ఒక పాత టేప్ రికార్డర్ , అందులోని క్యాసెట్ మాయమవుతుంది. అది కేవలం ఒక వస్తువు కాదు, అతని దివంగత భార్య పాడిన చివరి జ్ఞాపకం. దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రీతమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసులు సీరియస్ గా తీసుకోరు. ఈ క్రమంలో జరిగిన గొడవ వల్ల ప్రీతమ్ జైల్లో పడతాడు.

అదే సమయంలో, రూ. 28 లక్షల ఏటీఎం చోరీ కేసుతో పోలీసులు సతమతమవుతుంటారు. అక్కడే ఉన్న సీనియర్ కాప్ పెడ్రో గొన్సాల్వేస్ (అర్షద్ వార్సి)కి, తానొక హ్యాకర్ నని, కేవలం 15 నిమిషాల్లో దొంగలను పట్టుకుంటానని ప్రీతమ్ సవాల్ విసురుతాడు. చెప్పినట్లుగానే కేసును ఛేదించడంతో ఇంప్రెస్ అయిన పెడ్రో, ప్రీతమ్ తాతగారి టేప్ రికార్డర్‌ను వెతికేందుకు అంగీకరిస్తాడు. మరోవైపు స్పోర్ట్స్ మినిస్టర్ సర్దేశాయ్ (సత్యదీప్ మిశ్రా) కొడుకు విన్నీ కిడ్నాప్‌కు గురవుతాడు. సాంకేతికంగా అత్యంత తెలివైన, క్రూరడైన కిడ్నాపర్ మార్టిన్ (విక్రాంత్ మాస్సే) నుండి మంత్రి కొడుకును పెడ్రో, ప్రీతమ్ కలిసి ఎలా కాపాడారు అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

ఈ సిరీస్‌కు ప్రధాన బలం రాజ్‌కుమార్ హిరానీ మార్క్ ‘నవ్వు-ఏడుపు-డ్రామా’ ఫార్ములా. కథనం చాలా వేగంగా, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ 33 నుండి 37 నిమిషాల నిడివితో క్రిస్ప్‌గా ఉంటుంది. టెక్నాలజీ అస్సలు తెలియని పోలీస్ ఆఫీసర్ పెడ్రో, హ్యాకింగ్‌లో నిపుణుడైన యువకుడు ప్రీతమ్.. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చాలా వినోదాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే (మార్టిన్) ఎంట్రీ తర్వాత కిడ్నాప్ ట్రాక్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మంత్రి ఇంట్లో కెమెరా పెట్టానంటూ మార్టిన్ సృష్టించే హైడ్రామా సీన్లు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఆకట్టుకుంటాయి.

అయితే, సిరీస్‌లో సినిమాటిక్ లిబర్టీలు కాస్త ఎక్కువయ్యాయి. కిడ్నాపర్ మార్టిన్ ప్రతిసారీ పోలీసుల నుంచి అంత సులభంగా తప్పించుకోవడం నమ్మశక్యంగా అనిపించదు. అలాగే, కథనాన్ని వేగంగా నడిపే క్రమంలో కొన్ని ఎమోషనల్ సీన్లను సరిగ్గా పండించలేకపోయారు. ప్రీతమ్ తాతగారి బాధతో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేకపోతాడు. క్లైమాక్స్ లో వచ్చే న్యూస్ ఛానల్ సీక్వెన్స్ కూడా కాస్త సిల్లీగా అనిపిస్తుంది.

నటీనటుల ప్రదర్శన

అర్షద్ వార్సి తనదైన కామెడీ , ఎమోషనల్ యాక్టింగ్‌తో సిరీస్‌ను ముందుండి నడిపించారు. విక్రాంత్ మాస్సే విలన్‌గా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వీర్ హిరానీ (రాజ్‌కుమార్ హిరానీ కుమారుడు) లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఫస్ట్ క్లాస్ డెబ్యూ ఇచ్చారు. మోనా సింగ్, సత్యదీప్ మిశ్రా, శృతి మరాఠే తమ పాత్రలకు న్యాయం చేశారు. సంజయ్ దత్, వీరేంద్ర సెహ్వాగ్ ల కామియోలు నవ్వులు పూయిస్తాయి.

సాంకేతిక వర్గం

అవినాష్ అరుణ్ ధావరే సినిమాటోగ్రఫీ గోవా అందాలను, సైబర్ క్రైమ్ మూడ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. సంజయ్ వాండ్రేకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా విలన్ సీన్లలో వచ్చే థీమ్ మ్యూజిక్ థ్రిల్ కలిగిస్తుంది. శ్రేయా ఘోషల్ పాడిన ‘పియా పియా పియా’ సాంగ్ బాగుంది. హిరానీ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. అయితే, బొమన్ ఇరానీ, శృతి మరాఠేల చిత్రాలలో ఉపయోగించిన AI విజువల్స్ కాస్త లోక్వాలిటీ అనిపిస్తాయి.

ఫైనల్ గా చెప్పాలంటే.. నైల్-బైటింగ్ కథనం, వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ప్రస్తుత కాలానికి అవసరమైన సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్ , అర్షద్ వార్సి-విక్రాంత్ మాస్సేల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం 'ప్రీతమ్ అండ్ పెడ్రో' వెబ్ సిరీస్‌ను ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story