ఓటీటీలోకి వచ్చేస్తున్న సచిన్ టెండూల్కర్ బయోపిక్.. ఎక్కడంటే?

Sachin Tendulkar: క్రికెట్ ప్రపంచంలో ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పిలవబడే లెజెండరీ బ్యాట్స్‌మెన్ సచిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అద్భుత బయోపిక్ డాక్యు-డ్రామా ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’.

Srinivas Rao
Published on: 26 May 2026 11:37 AM IST
Sachin Tendulkar
X

ఓటీటీలోకి వచ్చేస్తున్న సచిన్ టెండూల్కర్ బయోపిక్.. ఎక్కడంటే?

Sachin Tendulkar: క్రికెట్ ప్రపంచంలో ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పిలవబడే లెజెండరీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అద్భుత బయోపిక్ డాక్యు-డ్రామా ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ (Sachin: A Billion Dreams). ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా' (Aha) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

ఆహా ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్

గతంలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ డాక్యుమెంటరీని త్వరలోనే తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రమోషనల్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ , సినిమా లవర్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే, ఈ చిత్రం ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందనే అధికారిక తేదీని (Aha Streaming Date) సంస్థ ఇంకా ప్రకటించలేదు. వచ్చే వారం దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సచిన్ ప్రయాణంలోని అరుదైన దృశ్యాలు

జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ కేవలం సచిన్ క్రికెట్ రికార్డులను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో హృద్యంగా చూపించింది. సచిన్ చిన్ననాటి అరుదైన హోమ్ వీడియోలు, ఎక్కడా చూడని ఆర్కైవల్ మ్యాచ్ ఫుటేజ్, భారత క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే 2011 ప్రపంచ కప్, విజయ ఘట్టాలు, దేశం మొత్తం ఆశలను తన భుజాలపై మోస్తూ సచిన్ ఎదుర్కొన్న ఒత్తిడిని ఈ డాక్యూమెంటరీలో చూడొచ్చు.

ఈ చిత్రంలో సచిన్ భార్య అంజలి టెండూల్కర్, ఆయన కెరీర్ వెనుక అండగా నిలిచిన సోదరుడు అజిత్ టెండూల్కర్ పంచుకున్న ఎమోషనల్ విషయాలు ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేస్తాయి.

స్టార్ క్రికెటర్ల సందడి.. రెహమాన్ సంగీతం

ఈ బయోపిక్‌లో సచిన్‌తో పాటు భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ , సౌరవ్ గంగూలీలు కూడా కనిపించి, సచిన్‌తో తమకున్న అనుబంధాన్ని , మైదానంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రవి భాాగ్‌చంద్కా, శ్రీకాంత్ భాసి సంయుక్తంగా ‘200 నాటౌట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్ జర్నీని మరో లెవెల్‌కు తీసుకువెళ్లింది. త్వరలోనే ‘ఆహా’లో విడుదల కానున్న ఈ మాస్టర్ పీస్ కోసం తెలుగు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story