Sector 36: దేశాన్ని షేక్ చేసిన వ‌రుస హ‌త్య‌లు.. ఓటీటీలో నిజ‌జీవిత ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌

Sector 36: దేశాన్ని ఒక్కసారి షాక్‌కు గురిచేసిన రియ‌ల్‌ క్రైమ్ ఘటనలు ఇప్పుడు సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు కథలుగా మారుతున్నాయి.

Mokshith
Published on: 8 April 2026 12:38 PM IST
Sector 36
X

Sector 36

Sector 36: దేశాన్ని ఒక్కసారి షాక్‌కు గురిచేసిన రియ‌ల్‌ క్రైమ్ ఘటనలు ఇప్పుడు సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు కథలుగా మారుతున్నాయి. అలాంటి ఘటనల్లో ఒకటి నోయిడాలో జరిగిన నిఠారీ వరుస హత్యలు. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన చిత్రమే ‘సెక్టార్ 36’. విక్రాంత్ మెస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏంటంటే?

సెక్టార్ 36 ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక ధనవంతుడి ఇంట్లో ప్రేమ్ సింగ్ (విక్రాంత్ మెస్సే) పని చేస్తుంటాడు. బయటికి సాధారణంగా కనిపించే ఈ వ్యక్తి లోపల మాత్రం భయంకరమైన రహస్యాన్ని దాచుకుని ఉంటాడు. చిన్న పిల్లలు, యువతులను కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలు చేస్తుంటాడు. తర్వాత వారి శరీరాలను ముక్కలుగా చేసి మురికి కాల్వల్లో పడేస్తుంటాడు.

ఆ ప్రాంతంలో వరుసగా పిల్లలు కనిపించకుండా పోతున్నా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల కేసులు ముందుకు సాగవు. అయితే ఇన్‌స్పెక్టర్ రామ్ చరణ్ పాండే (దీపిక్ డోబ్రియల్) కుమార్తెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ప్రేమ్ సింగ్ కనిపిస్తాడు. అప్పటివరకు పట్టించుకోని మిస్సింగ్ కేసులను పాండే సీరియస్‌గా తీసుకుంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ హత్యల వెనుక కారణం ఏమిటి? ప్రేమ్ సింగ్ వెనుక మరెవరైనా ఉన్నారా? చివరకు పోలీసులు నిజాన్ని బయటపెట్టగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చివర్లో తెలుస్తుంది.

దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ఈ సినిమాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మొదట్లోనే ఒక ఘోర హత్యను చూపించి కథకు టోన్ సెట్ చేశారు. అక్కడి నుంచి మిస్సింగ్ కేసులు, పోలీసు వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం వంటి అంశాలను చూపిస్తూ కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు.

ఇన్‌స్పెక్టర్ పాండే విచారణ ప్రారంభించిన తర్వాత కథలో టెన్షన్ పెరుగుతుంది. ప్రేక్షకులకు హంతకుడు ఎవరో తెలిసినా, పోలీసులు ఎలా పట్టుకుంటారన్న అంశం ఆసక్తిని పెంచుతుంది. విచారణ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ్ సింగ్ చెప్పే విషయాలు కొన్ని చోట్ల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంటాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్రత్యేకతను ఇస్తుంది.

మొత్తం మీద నిజ ఘటనల ఆధారంగా తీసిన క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ‘సెక్టార్ 36’ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. అయితే కుటుంబంతో క‌లిసి ఈ సినిమా చూడ‌డం ఇబ్బందే అని చెప్పాలి. క్రైమ్ డ్రామాలు, ఇన్వెస్టిగేషన్ కథలు చూడడం ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతి ఇస్తుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story