Seetharam Benoy 2 Review: చివరి ట్విస్ట్ షాక్ ఇస్తుందా.? లేక నిరాశేనా.?

Seetharam Benoy 2 Review: కన్నడ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'సెకండ్ కేస్ ఆఫ్..

G Krishna
Published on: 4 Aug 2026 5:33 PM IST
Seetharam-Benoy-2
X

Seetharam-Benoy-2

Seetharam Benoy 2 Review: కన్నడ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్'. గతంలో వచ్చిన హిట్ చిత్రం 'సీతారామ్ బెనోయ్ కేసు నెంబర్ 18'కి ఇది సీక్వెల్. దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి వచ్చింది. తాజాగా జులై 31 నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం..

కథేంటంటే?

కర్ణాటకలోని ఒక గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో సీతారామ్ (విజయ్ రాఘవేంద్ర) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతంలో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతుంటాయి. బాధితుల కాళ్లు, చేతులను ఇనుప ముళ్లతీగలతో కట్టేసి కిరాతకంగా చంపుతుండటంతో ఇది ఒక సైకో కిల్లర్ పనేనని సీతారామ్ నిర్ధారణకు వస్తాడు. సరిగ్గా అదే సమయంలో, స్కూల్ మాస్టర్ సెబాస్టియన్ తన కూతురిని ఒక యువకుడు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వస్తాడు.

మరొకవైపు, సీతారామ్ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ మాయమవుతుంది. తన గన్‌తో హంతకుడు ఏం చేస్తాడోనన్న ఆందోళన అతనిని వెంటాడుతుంది. ఇదే క్రమంలో ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసిన సీతారామ్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. సెబాస్టియన్ కూతురు మూడు నెలల క్రితమే చనిపోయిందని, అతను ఫిర్యాదు చేసిన యువకుడు కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. అంతేకాకుండా, హత్యకు గురైన వారందరూ టీనేజ్ అమ్మాయిల తండ్రులే కావడం, ప్రతీ హత్యకు ముందు ఆయా కుటుంబాలకు ఒక 'వీణ బొమ్మ' దొరకడం సీతారామ్‌ను అయోమయానికి గురిచేస్తుంది. ఇంతలో సీతారామ్ అక్క కూతురికి కూడా ఆ వీణ బొమ్మ దొరుకుతుంది. ఆ తర్వాత సీతారామ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? వీణ బొమ్మకు, ఈ వరుస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.

కథనం, విశ్లేషణ ఎలా ఉందంటే?

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హంతకుడెవరో ముందే చూపించి, అతడిని పోలీస్ ఎలా పట్టుకుంటాడనేది ఆసక్తికరంగా చెప్పడం. రెండోది హంతకుడెవరో చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచి ప్రేక్షకుడిని కూడా ఇన్వెస్టిగేషన్‌లో భాగం చేయడం. ఈ సినిమా రెండో రకానికి చెందినది.

కథలో అనుమానాన్ని రకరకాల పాత్రలపైకి మళ్లిస్తూ ప్రేక్షకులను డైవర్ట్ చేసే ప్రయత్నం బాగానే చేశారు. ఒక చిన్న ప్రేమకథ, సంగీతం, వీణ బొమ్మ నేపథ్యంతో కథకు కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ప్రేమకథ కొంతవరకు పర్వాలేదనిపించినా, సంగీతం ఆధారంగా సాగే ట్రాక్ మాత్రం ఆశించిన స్థాయిలో పండలేదు సరేకదా, కథనాన్ని కాస్త లాగదీసినట్లు అనిపిస్తుంది. హంతకుడిని పట్టించే సీన్ కానీ, అతను సైకోగా మారడానికి చూపించిన ఫ్లాష్‌బ్యాక్ కారణం కానీ అంత బలంగా, థ్రిల్లింగ్‌గా అనిపించకపోవడం కథకు పెద్ద మైనస్.

నటీనటులు, సాంకేతిక విభాగం

పోలీస్ ఆఫీసర్ సీతారామ్‌గా విజయ్ రాఘవేంద్ర తన సీరియస్ నటనతో మెప్పించారు. పాత్రకు తగిన హుందాతనాన్ని ఆయన తీసుకొచ్చారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హేమంత్ ఆచార్య ఛాయాగ్రహణం విలేజ్ అట్మాస్ఫియర్‌ను బాగా చూపించింది. నవనీత్ శ్యామ్ నేపథ్య సంగీతం, శశాంక్ నారాయణ ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తాయి. చివరిగా..సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' ఒక ఓకే అనిపించే డీసెంట్ వాచ్. కాకపోతే, క్రైమ్ థ్రిల్లర్లలో ఉండే ఉత్కంఠత, బలమైన ట్విస్టులను ఆశిస్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. సాధారణ థ్రిల్లర్లను ఆస్వాదించేవారు ప్రైమ్ వీడియోలో దీనిని ఓసారి చూసేయవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story