The Hardacres 2: ఓటీటీలో ‘ది హార్డ్‌క్రీస్ 2’.. ట్విస్టులతో అదిరే పీరియడ్ డ్రామా.!

The Hardacres 2 Ott: డిజిటల్ తెరపై పీరియడ్ డ్రామాలకు ఉండే క్రేజ్ వేరు. తాజాగా ఆ కోవకు చెందిన ‘ది హార్డ్‌క్రీస్’ (The Hardacres) సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది.

G Krishna
Published on: 16 May 2026 6:29 PM IST
The Hardacres Season 2
X

The Hardacres Season 2

The Hardacres 2 Ott: డిజిటల్ తెరపై పీరియడ్ డ్రామాలకు ఉండే క్రేజ్ వేరు. తాజాగా ఆ కోవకు చెందిన ‘ది హార్డ్‌క్రీస్’ (The Hardacres) సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఒక సాధారణ పేద కుటుంబం అపారమైన ధనవంతులుగా ఎలా మారింది అనే క్లాసిక్ 'రగ్స్-టు-రిచెస్' కథాంశాన్ని, 1980ల నాటి లండన్ నేపథ్యానికి జోడించి ఈ సిరీస్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. సరికొత్త మలుపులతో సాగుతున్న ఈ రెండూ సీజన్ నెటిజన్లను, సిరీస్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న పాత నటీనటులు.. కొత్త పాత్రల ఎంట్రీ

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ రెండో సీజన్‌లో పాత పాత్రలన్నీ మళ్లీ సందడి చేస్తున్నాయి. సామ్ హార్డ్‌క్రీస్‌గా లియామ్ మెక్‌మాహన్, మేరీ హార్డ్‌క్రీస్‌గా క్లైర్ కూపర్ తమ నటనతో అలరిస్తున్నారు. వీరితో పాటు జూలీ గ్రాహం (మా), ఆడమ్ లిటిల్ (జో హార్డ్‌క్రీస్), షానన్ లావెల్ (లిజా హార్డ్‌క్రీస్), జాక్ ఫోర్డ్-విలియమ్స్ (హ్యారీ హార్డ్‌క్రీస్) తదితరులు తమ పాత పాత్రలను కొనసాగించారు. అయితే ఈ సీజన్‌లో కథను మరింత రక్తికట్టించడానికి ఒక సరికొత్త పాత్రను ప్రవేశపెట్టారు. ప్రముఖ నటి మిచెల్ డోట్రిస్ ఈ సీజన్ లో ప్రవేశించి, లేడీ ఎమ్మా తల్లి అయిన 'లేడీ ఇమెల్డా హాన్సెన్' పాత్రలో పవర్‌ఫుల్ నటనను కనబరిచారు.

ట్విస్టులతో సాగే సీజన్ 2

ఈ రెండో సీజన్ కథ విషయానికి వస్తే, ఒకప్పుడు ఓడరేవులో సాధారణ కార్మికులుగా పనిచేసిన హార్డ్‌క్రీస్ కుటుంబం, అనూహ్యంగా ధనవంతులుగా మారి సమాజంలో సెలబ్రిటీ హోదాను దక్కించుకుంటుంది. అయితే అంతంతమాత్రం ఉన్న జీవితం నుండి ఒక్కసారిగా విలాసవంతమైన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ కుటుంబానికి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఒకవైపు సమాజంలో తమ కొత్త హోదాను కాపాడుకోవడానికి వారు పోరాడుతుంటే, మరోవైపు దేశంలో వస్తున్న ఆర్థిక మాంద్యం వారి వ్యాపారాలను దెబ్బతీస్తుంది. వీటన్నింటికీ తోడు వ్యాపార రంగంలో సరికొత్త శత్రుత్వాలు, ముఖ్యంగా లేడీ ఇమెల్డా హాన్సెన్ నుండి వచ్చే రాజకీయ, సామాజిక ఇబ్బందులను ఈ కుటుంబం ఎలా ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశం. సామ్, మేరీ తమ కొత్త వ్యాపారాన్ని నిర్మించుకోవడంలో బిజీగా ఉంటే, వారి పిల్లలు మాత్రం ఈ హఠాత్తు మార్పులను తట్టుకోలేక మానసిక సంఘర్షణకు గురవుతుంటారు.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది..?

మే 14న అధికారికంగా ఆన్‌లైన్‌లోకి విడుదలైన ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ ప్రస్తుతం యూకేలోని 'ఛానల్ 5' (Channel 5) లో ప్రసారమవుతోంది. ఓటీటీ వీక్షకుల కోసం ఈ సిరీస్ 'మై5' (My5) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. పాతకాలపు లండన్ వాతావరణం, కుటుంబ భావోద్వేగాలు, వ్యాపార సామ్రాజ్యాల వెనుక ఉండే కుట్రలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో 'ది హార్డ్‌క్రీస్' సీజన్ 2 ఒక మంచి ఎంపిక కానుంది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story