Uyir OTT Review : ఆత్మహత్య అనుకున్న కేసు.. అంత్యక్రియల తర్వాత షాకింగ్ ట్విస్ట్.!

Uyir OTT Review : మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆ జోనర్‌ని ఆస్వాదించే సస్పెన్స్ ప్రియుల కోసం..

G Krishna
Published on: 4 Aug 2026 6:15 PM IST
uyir-ott-review
X

uyir-ott-review

Uyir OTT Review : మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆ జోనర్‌ని ఆస్వాదించే సస్పెన్స్ ప్రియుల కోసం తాజాగా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘ఉయిర్’. రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కాగా, ఈ రోజు (ఆగస్టు 4) నుంచి 'జియో హాట్ స్టార్' వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథేంటంటే?

కణ్ణూర్ జిల్లా పరిధిలోని ధర్మడం పోలీస్ స్టేషన్‌కు అజీబ్ (రోషన్ మాథ్యూ) ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆ స్టేషన్ పరిధిలోని కొడువల్లి గ్రామంలోని ఒక పాడుబడిన బావిలో మహిళ మృతదేహం ఉందనే సమాచారంతో అజీబ్ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్తాడు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని బయటకు తీసి విచారణ ప్రారంభిస్తారు.

మృతురాలు శోభ అని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. విచారణలో లభించిన ఒక ఫ్యామిలీ ఫోటో ఆధారంగా ఆమె భర్త రాజును వెతికి పట్టుకుంటారు. అయితే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆ మనస్తాపంతో పిల్లలను తీసుకుని తాను వెళ్ళిపోయానని రాజు పోలీసులకు చెబుతాడు. ఆత్మహత్యగా భావించి పోలీసులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేస్తారు.

తీరా అంత్యక్రియలు పూర్తయ్యాక స్టేషన్‌కు వచ్చిన శోభ బంధువులు ఆ ఫోటోను చూసి.. అతను రాజు కాదని, భువనేశ్ అని చెబుతారు. రాజు పేరుతో భువనేశ్ తమను తప్పుదారి పట్టించాడని, ఇది ఆత్మహత్య కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని అజీబ్‌కు అర్థమవుతుంది. దాంతో 24 గంటల్లో భువనేశ్‌ను పట్టుకోవాలని పైఅధికారులు ఆదేశిస్తారు. ఆ తర్వాత అజీబ్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? భువనేశ్ ఎవరు? శోభ భర్త, పిల్లలు ఏమయ్యారు? అనేది మిగతా కథ.

కథనం, విశ్లేషణ ఎలా ఉందంటే?

యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకు ఎంతో సహజంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆత్మహత్య అనుకుని అంత్యక్రియలు జరిపించిన తర్వాత, అది హత్య అని తేలితే ఒక పోలీస్ ఆఫీసర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే కోణాన్ని దర్శకుడు పద్మకుమార్ చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు.

సినిమాలో అనవసరమైన మాస్ హంగామా గానీ, బిల్డప్‌లు గానీ ఉండవు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం పక్కా రియలిస్టిక్ అప్రోచ్‌తో సాగుతుంది. హీరో ఈ కేసును పర్సనల్‌గా తీసుకోవడానికి వెనుక ఉన్న ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ కథకు మరింత బలాన్నిచ్చింది. ఆధారాలు సేకరించే విధానం, కేసులో ఎదురయ్యే మలుపులు వీక్షకుల్లో తదుపరి ఏం జరుగుతుందనే ఆత్రుతను నిరంతరం సజీవంగా ఉంచుతాయి.

నటీనటులు, సాంకేతిక విభాగం

ప్రొబేషనరీ ఎస్సై అజీబ్ పాత్రలో రోషన్ మాథ్యూ ఒదిగిపోయారు. ఒక సీరియస్ అండ్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన ఎంతో సహజంగా ఉంది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు చక్కటి అభినయాన్ని కనబరిచారు. సాంకేతిక పరంగా అజయ్ డేవిడ్ ఛాయాగ్రహణం మలయాళ గ్రామీణ వాతావరణాన్ని, సీరియస్ మూడ్‌ను చాలా బాగా క్యాప్చర్ చేసింది. మణికందన్ అయ్యప్ప ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ఎలిమెంట్స్‌ని బాగా ఎలివేట్ చేయగా, రంజన్ అబ్రహం ఎడిటింగ్ కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా నిడివిని సరిగ్గా మేనేజ్ చేసింది. చివరిగా.. సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ, అనవసరపు హడావుడి లేకుండా సాగే ఒక పక్కా రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఉయిర్'. మంచి మైండ్ గేమ్, క్రైమ్ మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా హాట్‌స్టార్‌లో ఒక బెస్ట్ వాచ్‌గా నిలుస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story