Weekend Watch : వీకెండ్ స్పెషల్.. మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌లు..

Weekend Watch : వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. చాలామందికి టైంపాస్ అవ్వడం ఒక పెద్ద టాస్క్. రొటీన్ లవ్ స్టోరీలు, అరిగిపోయిన కామెడీ ట్రాకులు చూసి బోర్ కొట్టిన

G Krishna
Published on: 15 May 2026 6:45 PM IST
The Night Of
X

The Night Of

Weekend Watch : వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. చాలామందికి టైంపాస్ అవ్వడం ఒక పెద్ద టాస్క్. రొటీన్ లవ్ స్టోరీలు, అరిగిపోయిన కామెడీ ట్రాకులు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లే అసలైన వినోదం. ట్విస్టుల మీద ట్విస్టులతో, చివరి వరకు ఉత్కంఠను రేకెత్తిస్తూ సీటు అంచున కూర్చోబెట్టే అంతర్జాతీయ స్థాయి సిరీస్‌లు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 'జియో హాట్‌స్టార్'లో 8 కి పైగా ఐఎండిబి (IMDb) రేటింగ్‌తో ఉన్న కొన్ని బెస్ట్ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని చూస్తే మీ వీకెండ్ పక్కాగా క్రేజీగా మారిపోతుంది.

చెర్నోబిల్ (Chernobyl) - గుండెల్ని వణికించే వాస్తవ గాథ

1986లో సోవియట్ యూనియన్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఇది కల్పిత కథ కాదు, పచ్చి నిజం. ఆ ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న రాజకీయాలు ఏంటి? ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వం ఆ నిజాన్ని ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది? అనేది ఇందులో చూడవచ్చు. ఏ హర్రర్ సినిమాకూ తీసిపోని విధంగా, చూస్తున్నంత సేపు గుండెల్లో వణుకు పుట్టించేలా ఈ సిరీస్ ఉంటుంది. రియలిస్టిక్ మేకింగ్ ఇష్టపడే వారికి ఇది ఒక మాస్టర్ పీస్.

ది నైట్ ఆఫ్ (The Night Of) - గ్రిప్పింగ్ కోర్ట్‌రూమ్ ఇన్వెస్టిగేషన్

ఒక సాదాసీదా కాలేజ్ కుర్రాడు ఒక రాత్రి ఒక అమ్మాయితో గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ అమ్మాయి రక్తం మడుగులో శవమై కనిపిస్తుంది. ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఆ కుర్రాడికి వ్యతిరేకంగా ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. కానీ అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అతను నిజంగానే హత్య చేశాడా? లేక ఎవరో అతడిని ఇరికించారా? అనే సస్పెన్స్ ఆఖరి వరకు నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ , కోర్ట్‌రూమ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ (Mare of Easttown) - ఇన్వెస్టిగేషన్ అండ్ ఎమోషనల్ డ్రామా

ఒక చిన్న టౌన్‌లో ఒక యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. అదే టౌన్‌లో మరో అమ్మాయి కనిపించకుండా పోయి ఏడాది గడిచినా ఆచూకీ దొరకదు. ఈ సంక్లిష్టమైన కేసులను ఛేదించడానికి 'మేర్' అనే లేడీ డిటెక్టివ్ రంగంలోకి దిగుతుంది. ఇందులో కేవలం క్రైమ్ మాత్రమే కాదు, ఆ డిటెక్టివ్ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణలను చాలా లోతుగా చూపించారు. కేట్ విన్స్లెట్ తన నటనతో ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. చివరి నిమిషం వరకు హంతకుడు ఎవరో ఊహించడం ప్రేక్షకుడికి అసాధ్యం.

వాచ్‌మెన్ (Watchmen) - డిఫరెంట్ సూపర్ హీరో థ్రిల్లర్

సాధారణ సూపర్ హీరో సినిమాల్లా కాకుండా, ఇది డార్క్ మిస్టరీ , పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఒక రేసిస్ట్ గ్రూప్ చేసే దాడుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్, మిస్టరీ , కాంప్లెక్స్ కథనం ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. కథ నడిచే విధానం చాలా కొత్తగా ఉండటమే కాకుండా, సమాజంలోని కొన్ని కీలక అంశాలను కూడా ప్రశ్నిస్తుంది.

ది యంగ్ పోప్ (The Young Pope) - వాటికన్ రహస్యాల వెనుక..

చరిత్రలోనే అతి తక్కువ వయసులో వాటికన్ సిటీకి హెడ్‌గా, అంటే పోప్‌గా బాధ్యతలు చేపడతాడు లెన్ని బెలార్డో అనే వ్యక్తి. మతం, సంప్రదాయం పేరుతో నడిచే లోపాయికారి రాజకీయాలు, వాటికన్ సిటీ గోడల మధ్య దాగి ఉండే రహస్యాలను ఈ సిరీస్ లో చాలా బోల్డ్‌గా చూపించారు. ఒక వ్యక్తి తన పవర్ ఉపయోగించి వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాడు అనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది.

షార్ప్ అబ్జెక్ట్స్ (Sharp Objects) - సైకలాజికల్ మిస్టరీ

ఒక చిన్న గ్రామంలో ఇద్దరు బాలికలు అదృశ్యమై శవాలై దొరుకుతారు. ఈ కేసును రిపోర్ట్ చేయడానికి 'కామిల్లె' అనే క్రైమ్ జర్నలిస్ట్ తన సొంత ఊరికి వెళ్తుంది. అయితే అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు, తన కుటుంబంలోని చీకటి రహస్యాలు ఆమెను మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. ఆ ఊరి వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్స్ ప్రియులకు ఇది ఒక విందు భోజనం లాంటిది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story