Delimitation Bill 2026: డిలిటేషన్ బిల్ 2026: ఎవరిది రైటు ఎవరిది తప్పు?
Delimitation Bill 2026: దేశ రాజకీయాల్లో ఇటీవల భారీ చర్చకు దారి తీసిన అంశం డిలిమిటేషన్ బిల్ 2026.
Delimitation Bill 2026: డిలిటేషన్ బిల్ 2026: ఎవరిది రైటు ఎవరిది తప్పు?
Delimitation Bill 2026: దేశ రాజకీయాల్లో ఇటీవల భారీ చర్చకు దారి తీసిన అంశం డిలిమిటేషన్ బిల్ 2026. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలు, జనాభా ఆధారిత ప్రతినిధిత్వం వంటి కీలక మార్పులను లక్ష్యంగా పెట్టుకున్న ఈ బిల్లు చివరికి లోక్‌సభలో ఆమోదం పొందలేదు. దీంతో అధికార.. ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు మొదలయ్యాయి. అసలు ఈ బిల్లులో నిజం ఏమిటి? ఎవరి వాదన సబబు? అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
బిల్లులోని ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
ప్రస్తుత జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ద్వారా పరిపాలనా సౌలభ్యాన్ని పెంచాలని కేంద్రం భావించింది. దీని కోసం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానమైనది సీట్ల పెంపు. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. దీనిని 850కి పెంచాలని కేంద్రం భావించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు. పెరిగిన లోక్‌సభ స్థానాల్లో 33శాతం మహిళలకు కేటాయించాలని కూడా బిల్లులో పొందుపరిచారు. అయితే, 2021లో కరోనా కారణంగా నిలిచిపోయిన జనగణన కారణంగా 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులు మార్చాలని నిర్ణయించారు. ఈ బిల్లులో ఉన్న కీలక అంశాలు, ప్రధాన లక్ష్యాలు ఇవే.
పార్లమెంట్‌లో ఏమి జరిగింది?
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు ఆమోదం రావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అయితే ఓటింగ్‌లో 528 మంది సభ్యులు పాల్గొనగా 298 మంది మద్దతు, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదానికి కనీసం 326 ఓట్లు అవసరం కాగా, ఆ సంఖ్య చేరుకోలేకపోయింది. దీంతో స్పీకర్ బిల్లు తిరస్కరించబడిందని ప్రకటించారు.
ఎవరి వాదన ఏమిటి? ఎవరిది రైటు?
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని కేంద్రం చెబుతోంది. "ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా హక్కులను కాలరాశాయి" అని కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశాభివృద్ధిలో ఇది ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోవడమేనని ఎన్డీయే పక్షాలు పేర్కొంటున్నాయి.
అయితే, ప్రతిపక్షాల ఆందోళన ప్రధానంగా ప్రాంతీయ అసమానతలపైనే ఉంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళకు అన్యాయం జరుగుతుందని, చట్టసభల్లో ప్రాతినిథ్యం తగ్గిపోతుంది. అదే సమయంలో సీట్ల పెంపు ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పట్టున పార్టీలో కేంద్రంలో శాశ్వత అధికారం పొందే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్రం ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తోందని ఆరోపణలు.
ఉత్తర–దక్షిణ వివాదం
ఈ బిల్లులో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఇదే. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో సీట్లు పెరిగే అవకాశం ఉండటం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ ఉండటం వల్ల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉండటం వలన ఈ వివాదం చెలరేగింది. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు శిక్ష పడుతుందా? అనే ప్రశ్న ముందుకు వచ్చింది. దీని చుట్టూ రెండు రోజులపాటు సభలో వాడివేడిగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీట్ల పెంపు హామీ ఇచ్చింది. అంటే తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా ఈ సంఖ్య 59కి పెరుగుతుంది. ప్రస్తుతం దక్షిణాదిన 125 ఎంపీ స్థానాలుంటే డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఆ సంఖ్య 195కి చేరుతుంది. సభా ముఖంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీని ప్రతిపక్షాలు స్వీకరించలేదు. దీంతో బిల్లును అడ్డుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాయి.
ఈ బిల్లుతో సామాన్యుడికి నష్టమా లాభమా?
ఒక సామాన్య పౌరుడికి ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కాలి. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. రెండోది జనాభా ప్రాతిపదికన విభజన చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. అయితే, ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. అయితే, ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం లేకుండా ఇంత పెద్ద మార్పులు చేయడం కష్టమని ఈ ఫలితం నిరూపించింది. ప్రతిపక్షాలు జరుపుకుంటున్న సంబరాలు ఒకవైపు, అధికార పక్షం వ్యక్తం చేస్తున్న ఆవేదన మరోవైపు. ఈ రెండు పోరాటాల మధ్య నలిగిపోతున్నది సామాన్య ఓటరు ఆకాంక్షలేనా? అన్నది ప్రశ్న.
ఈ బిల్లును ప్రస్తుతానికి ప్రతిపక్షాలు అడ్డుకున్నా...అధికార పార్టీ ఇక్కడితో ఆగుతుందా అంటే లేదనే అంటున్నారు విశ్లేషకులు. 2029 ఎన్నికలకు ముందు ఏదో ఒక రూపంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లు వీగిపోవడం ఎవరికి అనుకూలంగా మారుతుంది అన్నది ఆసక్తికరం. మహిళలకు మేలు చేసే బిల్లును అడ్డుకున్నారని అధికార పార్టీ, బిల్లును అడ్డుకోవడంతో డిల్లీపై విజయం సాధించామని ప్రాంతీయ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో డిలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారబోతున్నది. మహళా వ్యతిరేకులు ఎవరో ప్రజలే తేలుస్తారని బీజేపీ చెబుతుంటే, సమాఖ్య స్ఫూర్తిని రక్షించామనే గర్వంతో విపక్షాలు ఉన్నాయి. ఏది ఏమైనా, 2026 నాటి ఈ పరిణామం భారత ప్రజాస్వామ్య పరిణతికి ఒక అగ్ని పరీక్ష వంటిది. ఎవరిది రైటు, ఎవరిది తప్పు అనేది త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలే తమ ఓటు ద్వారా తీర్పు చెప్పనున్నారు.




