Rajahmundry: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు!
Rajahmundry: నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ (PGRS) వేదికగా 19 అర్జీల స్వీకరణ.
Rajahmundry: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు!
Rajahmundry: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపకుండా, నాణ్యమైన పరిష్కారం అందించి.. ప్రజలలో సానుకూలతను పెంచాలని అధికారులను అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు.
మొత్తం 19 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 8, రెవెన్యూకి సంబంధించి 1, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 6, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 1, మెప్మాకు సంబంధించి 1, వార్డు సచివాలయాలకు సంబంధించి 1, పింఛన్లకు సంబంధించి ఒకటి ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తిస్థాయిని పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఫిర్యాదుదారునితో తప్పనిసరిగా మాట్లాడాలని, దాని వల్ల చాలావరకు అర్జీలను పరిష్కరించేందుకు, సమస్యను పూర్తిగా అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ప్రజలకు స్పష్టంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారం ఉండాలని.. కనుక సమస్యను మూలాల వరకు పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. తమ విభాగానికి సంబంధంలేని దరఖాస్తు తమకు వచ్చిన పక్షంలో, దానిని సంబంధిత విభాగానికి పంపించాలి తప్ప మూసివేయకూడదని స్పష్టం చేశారు.
అలాగే పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్ణీత గడువు దాటకూడదని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.




