Ainavilli: అయినవిల్లి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం!
Ainavilli: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గంతో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. రూ.7 కోట్లతో ఆలయాభివృద్ధి పనులు.
Ainavilli: అయినవిల్లి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం!
Ainavilli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ చైర్మన్, సభ్యులతో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన చైర్మన్ శ్రీ విల్లా సూరయ్య కాపు పాలకవర్గ సభ్యులు ఆలయ నియమ నిబంధనలను పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కూడా సుమారు రూ.7 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ నిర్మాణాలు, భక్తుల సౌకర్యాల కల్పనతో పాటు భోజనశాల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నామని, భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆలయాల పవిత్రతను కాపాడుతూ, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




