Amalapuram: కోనసీమ కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
Amalapuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Amalapuram: కోనసీమ కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
Amalapuram: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనకు, గిరిజనులపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా చిన్న వయసులోనే ఆయన విప్లవ శంఖం పూరించారని అన్నారు. మన్యం ప్రజల హక్కులు, మాతృభూమి విముక్తి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయుడని కొనియాడారు.
అల్లూరి చూపిన దేశభక్తి, ధైర్యసాహసాలు నేటి యువతకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభ్యున్నతి కోసం అల్లూరి చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవడమే కాకుండా, వారు ఆశించిన సమాజ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి మాట్లాడుతూ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అసమాన పోరాటం సాగించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఆయన జీవితం దేశభక్తి, త్యాగం, నిబద్ధత, ధర్మబద్ధమైన పోరాటానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు.
స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి వంటి మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టుకుని సమాజసేవ, దేశసేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, ధైర్యసాహసాలు, సేవాతత్వం వంటి విలువలు అల్లూరి జీవితంలో ప్రతిఫలించాయని పేర్కొంటూ, ఆయన జయంతి సందర్భంగా జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేసుకుని దేశాభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర
పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో వి. సుబ్బారావు, కలెక్టరేట్ ఏవో నాగలక్ష్మమ్మ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




