Amalapuram: అమలాపురంలో పరిషత్ కౌంటింగ్ నిర్వహణపై కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు
Amalapuram: అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం. పారదర్శకంగా లెక్కింపు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం.
Amalapuram: అమలాపురంలో పరిషత్ కౌంటింగ్ నిర్వహణపై కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు
అమలాపురం: ఓట్ల లెక్కింపులో పారదర్శకత, నిష్పక్షపాతమే ప్రధాన లక్ష్యం ప్రతి సందేహాన్ని ముందుగానే నివృత్తి చేసుకోవాలి.కౌంటింగ్ సిబ్బంది,సూపర్వైజర్లు,అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.జిల్లాలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా,పూర్తిస్థాయి పారదర్శకతతో,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ సిబ్బంది ముందస్తు అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఆర్. మహేష్ కుమార్ సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు రహస్యాన్ని తప్పనిసరిగా కాపాడాలని,ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది,కౌంటింగ్ సూపర్వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్,జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవితో కలిసి పాల్గొని కౌంటింగ్ నిర్వహణపై పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఎన్నికల కౌంటింగ్ అనేది అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని,ఇందులో ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు విధానం,బ్యాలెట్ పేపర్ల వేర్పాటు,కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు,కౌంటింగ్ హాళ్ల నిర్వహణ,అభ్యర్థులు,వారి ఏజెంట్లకు సంబంధించిన నిబంధనలు,పోలీసు భద్రతా ఏర్పాట్లు,ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాటిని ముందుగానే సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలపై స్పష్టత పొందాలన్నారు.సరైన అవగాహనతో విధులు నిర్వహించడం ద్వారా కౌంటింగ్ ప్రక్రియలో తప్పిదాలు, వివాదాలకు అవకాశం లేకుండా చూడవచ్చని తెలిపారు.
మూడు నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు సంబంధించి మూడు నియోజకవర్గాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని పది మండలాలకు సంబంధించి అమలాపురం పట్టణంలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,విశ్వకవి వేమన డిగ్రీ కళాశాల కౌంటింగ్ ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలకు సంబంధించి రామచంద్రాపురంలోని ఎస్.కె.జి.పి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి,సిబ్బంది తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రం, కౌంటింగ్ హాలు,టేబుళ్ల సంఖ్య, విధుల కేటాయింపు,రౌండ్ల నిర్వహణ తదితర అంశాలపై ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పరిశీలించుకొని,తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ముందుగా ఎంపీటీసీ,అనంతరం జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా బ్యాలెట్ పేపర్లను ముందుగా నిబంధనల ప్రకారం వేరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.మొదట ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించి, ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టాలని తెలిపారు.
ఈ క్రమంలో సిబ్బంది ఎలాంటి గందరగోళానికి గురికాకుండా నిర్దేశించిన విధానాన్ని అనుసరించాలన్నారు.ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి బ్యాలెట్ పేపర్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని,చెల్లుబాటు అయ్యే ఓట్లు,చెల్లని ఓట్ల విషయంలో ఎన్నికల నిబంధనలను అనుసరించాలని సూచించారు.లెక్కింపు ప్రక్రియలో ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా,ప్రతి రౌండ్లో లెక్కింపు వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.నిర్ణీత సమయంలో లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
పోలీసు భద్రత,ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరి అని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు ఉండాలని, కౌంటింగ్ హాళ్లలోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతించాలని కలెక్టర్ సూచించారు.కౌంటింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.
అభ్యర్థులు,వారి ఏజెంట్లు,కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని,కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతానికి,నిర్లక్ష్యానికి తావులేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమైన దశ అని,ఈ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రతి రౌండ్లోనూ పారదర్శకత పాటిస్తూ, నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత మాధవి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




