కాలువల రక్షణ గోడల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.. కలెక్టర్

Amalapuram: సాగు, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముక్కామల నుండి నడిపూడి వరకు కాలువల రక్షణ గోడల నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 22 Jun 2026 9:00 PM IST
Amalapuram
X

కాలువల రక్షణ గోడల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.. కలెక్టర్

అమలాపురం: డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సాగునీరు, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు కాలువల వెంబడి చేపట్టిన రిటైనింగ్ వాల్స్ (రక్షణ గోడలు) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, జాతీయ రహదారుల శాఖ ఇంజనీర్లతో ముక్కామల నుంచి నడిపూడి వరకు చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముక్కామల–నడిపూడి పంట కాలువ వెంబడి మోసళ్ళపల్లి, పాలగుమ్మి, నడిపూడి గ్రామాల పరిధిలో సుమారు 470 మీటర్ల పొడవున మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కాలువలకు రక్షణ కల్పించడంతో పాటు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు చివరి ఆయకట్టు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా చేరేందుకు ఈ నిర్మాణాలు కీలకమని పేర్కొన్నారు.

ప్రస్తుతం కాలువల ద్వారా సాగునీటి సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో, నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. వర్షాకాలం, కాలువలకు నీటి విడుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ ఈఈ ఏవీఎస్ రాజన్, జాతీయ రహదారుల శాఖ ఏఈ వెంకటరమణ, డీఈలు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. వెంకటరామారావు, సంబంధిత గుత్తేదారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story