Amalapuram: మున్సిపాలిటీకి సోలార్ పవర్.. కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష
Amalapuram: అమలాపురం మున్సిపాలిటీ విద్యుత్ అవసరాల కోసం రూ. 4.5 కోట్లతో 500 కేవీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించామని కలెక్టర్ మహేష్ ఆదేశించారు.
Amalapuram: మున్సిపాలిటీకి సోలార్ పవర్.. కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష
Amalapuram: స్థానిక పురపాలక సంఘం విద్యుత్ అవసరాలను శాశ్వతంగా తీర్చే దిశగా తొలి దశలో 500 KV సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఈపీడీసీ ఎల్, నెడ్‌క్యాప్ మున్సిపల్ బ్యాంక్ అధికారులతో కలిసి సోలార్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలపై కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈసంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ నిర్మాణంలో ఆర్థిక సమతుల్యత పాటించాలన్నారు.పురపాలక సంఘ అవసరాల నిమిత్తం సుమారు రూ. 4.5 కోట్ల అంచనా వ్యయంతో ఈ పైలట్ ప్రాజెక్టును నిర్మించనున్నారన్నారు. ఇందు కోసం నడిపూడి వద్ద రెండు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం మున్సిపాలిటీ చెల్లిస్తున్న విద్యుత్ బిల్లుల మొత్తానికి లోబడే బ్యాంక్ ఈఎంఐ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీనివల్ల పురపాలక సంఘంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదన్నారు.ప్లాంట్ నిర్మాణం, బ్యాంక్ రుణాలు, వడ్డీ రేట్లపై మరోసారి క్షేత్రస్థాయి పర్యటన, వర్క్‌షాప్ నిర్వహించి సమగ్రమైన, ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఇదే తరహాలో బండారులంక గ్రామపంచాయతీలో కూడా విద్యుత్ వినియోగ చార్జీలు, ప్లాంట్ నిర్మాణ వ్యయాన్ని బేరీజు వేస్తూ సమతుల్య బడ్జెట్ తో ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
బోడసకుర్రు టిడ్కో గృహాల సమస్యల పరిష్కారం
బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై సమీక్షిస్తూ కాలనీలో సమస్యల పరిష్కారానికి మంజూరైన నిధులతో పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. ఎస్.టి.పి అవుట్‌లెట్ నిర్మాణం, త్రాగునీటి సరఫరాలో మైక్రో ఫిల్టర్ల ఏర్పాటుకు నిధులు మంజూరైనందున పనులు వేగవంతం చేయాలన్నారు.
మురికినీరు సేకరణ ట్యాంకు పనులను ముందుగా ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. డ్రైనేజీ పైప్‌లైన్‌ను మేజర్ డ్రైయిన్ వరకు అనుసంధానించాలన్నారు.కాలనీలో వీధి లైట్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈనెల 24వ తేదీన (జూన్ 24) తానే స్వయం గా బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశంలో టిడ్కో డివిజనల్ ఇంజనీర్ సురేంద్ర, ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) బి. రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్, ఎల్. డి.ఎమ్ కేశవ వర్మ, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ పి.ఎస్. నవీన్ కుమార్, నెడ్‌క్యాప్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.




