Mamidikuduru: నా జీవితంలో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతుంది: గొల్లపల్లి అమూల్య!

Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య బాధ్యతలు స్వీకరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు.

PRABHU, RAZOLE
Published on: 20 Nov 2026 12:37 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: నా జీవితంలో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతుంది: గొల్లపల్లి అమూల్య!

మామిడికుదురు: ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన తన ప్రస్థానం.. నేడు అంబేడ్కర్ కోనసీమ జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ స్థాయికి చేరడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన ఘట్టమని గొల్లపల్లి అమూల్య భావోద్వేగంతో అన్నారు. మామిడికుదురు జెడ్పీటీసీగా అత్యధిక మెజారిటీతో ప్రజల ఆదరణ పొందిన తాను, నేడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో గర్వంగా, మరింత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

దళిత మహిళనైన తనపై నమ్మకం ఉంచి, ఇంతటి అరుదైన గౌరవాన్ని, కీలక బాధ్యతను అప్పగించిన కూటమి నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటానని అమూల్య కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆదరించి, అఖండ మెజారిటీతో గెలిపించిన మామిడికుదురు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

పదవి తనకు అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్న ఆమె, విద్యావంతురాలిగా ప్రజల సమస్యలపై అవగాహనతో, అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు.

జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, సహకారంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్‌పర్సన్ గొల్లపల్లి అమూల్యకు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE