Rajahmundry: మహిళా జైలును సందర్శించిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గాంధీబాబు

Rajahmundry: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఉండవెల్లి గాంధీబాబు రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 12 Jun 2026 7:37 PM IST
Rajahmundry
X

Rajahmundry: మహిళా జైలును సందర్శించిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గాంధీబాబు

Rajahmundry: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఉండవెల్లి గాంధీబాబు శుక్రవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని శుక్రవారం సందర్శించి అక్కడ అమలవుతున్న సంక్షేమ, పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఆయనతో పాటు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీదేవి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కారాగారంలోని జనరల్ కిచెన్, ఆసుపత్రి, బేకరీ, ఖైదీల బ్యారక్స్, చిన్నారుల క్రచ్, ఆర్‌వో ప్లాంట్ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం మహిళా ఖైదీలతో ముఖాముఖి సమావేశమై వారికి అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయం ఉపాధి సాధించేందుకు ఈ శిక్షణలు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. కారాగారంలో ఖైదీలకు, గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, దుస్తుల పంపిణీ తదితర అంశాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖైదీల రోజువారీ ఆహార పట్టికను పరిశీలించిన గాంధీబాబు, ఆహారం నాణ్యంగా, పరిశుభ్రంగా అందిస్తున్నారని అభినందించారు. సెమీ ఓపెన్ జైలులో చేపడుతున్న ఉద్యానవన, కూరగాయల సాగు కార్యక్రమాలు ఖైదీలలో స్వయం ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయని కొనియాడారు. కారాగార పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా కుటుంబ వాతావరణంలో సోదరభావంతో ఖైదీలను చూసుకోవడం అభినందనీయమని తెలిపారు. బాత్రూములు, ఇతర సదుపాయాలు కూడా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

కారాగారంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక భావనలను అలవరచుకోవాలని ఖైదీలకు సూచించారు. ఖైదీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పర్యవేక్షణాధికారులు, సిబ్బందిని అభినందించిన ఆయన, ఇటువంటి వాతావరణంలో జైలు నిర్వహణకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ సి.హెచ్. వసంతకుమారి, పర్యవేక్షణాధికారి చెట్టి వసంత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి టి.శ్రీదేవి, బాలల సంక్షేమ అధికారి ప్రదీప్, శ్రీమతి ఇందిరా భారతి రాయ్, శ్రీమతి పి.పావని, శ్రీమతి కె.సుభాషిణి, శ్రీమతి బి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story