Rajahmundry: రాజమహేంద్రవరం రీజియన్‌లో ప్రమాద రహిత వారోత్సవాలు

Rajahmundry: రాజమహేంద్రవరం రీజియన్‌లో జూలై 25 నుండి 31 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు. వెల్లడించిన గోకవరం డిపో మేనేజర్ మార్గరెట్.

Prasanna, Rampachodavaram
Published on: 23 July 2026 7:21 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమహేంద్రవరం రీజియన్‌లో ప్రమాద రహిత వారోత్సవాలు

రాజముండ్రి: ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో జూలై 25 నుండి 31, 2026 వరకు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోలలో "ప్రమాద రహిత వారోత్సవాలు" ఘనంగా నిర్వహించనున్నట్లు గోకవరం బస్ డిపో మేనేజర్, ప్రజా రవాణా అధికారి సి.హెచ్.కె.ఎస్. మార్గరెట్ తెలిపారు.

ఈ వారోత్సవాల ద్వారా డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను మరింతగా బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముందుగా డ్రైవర్ సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ, "సున్నా ప్రమాదాలే మన లక్ష్యం" అనే భావనతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకర అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, రహదారిపై ఇతర వాహనదారులు, పాదచారుల పట్ల కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

వాహనం బయలుదేరే ముందు బ్రేకులు, స్టీరింగ్, లైట్లు, టైర్లు తదితర సాంకేతిక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అలసటగా అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తడి రోడ్లపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, మలుపులు, ఘాట్ రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించాలని తెలిపారు.

ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా అన్ని డిపోలలో డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, భద్రతా సూచనలపై సమావేశాలు, వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

"రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం – ప్రాణాలను కాపాడుదాం" అనే నినాదాన్ని ప్రతి ఉద్యోగి ఆచరణలో పెట్టాలని, సురక్షిత ప్రయాణమే ఉత్తమ సేవ అనే భావనతో విధులు నిర్వహించాలని గోకవరం డిపో మేనేజర్ సి.హెచ్.కె.ఎస్. మార్గరెట్ పిలుపునిచ్చారు. ప్రయాణికుల సహకారంతోనే ప్రమాద రహిత రవాణా వ్యవస్థ సాధ్యమవుతుందని, అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆమె కోరారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story