Gokavaram: లాభాలు కంపెనీకా రోగాలు ప్రజలకా? పాటంశెట్టి సూర్యచంద్ర ఫైర్!

Gokavaram: ఇథనాల్ పరిశ్రమ సామర్థ్యం పెంపుదలపై జూలై 14న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ ఒక ప్రహసనమని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 July 2026 11:15 PM IST
Gokavaram
X

Gokavaram: లాభాలు కంపెనీకా రోగాలు ప్రజలకా? పాటంశెట్టి సూర్యచంద్ర ఫైర్!

గోకవరం: మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలోని అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2 లక్షల లీటర్ల నుండి 3 లక్షల లీటర్లకు పెంచేందుకు ఈనెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కేవలం ఒక ప్రహసనమని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణపై స్థానిక ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస అవగాహన కల్పించకుండా అధికారులు కాలయాపన చేయడం అన్యాయమన్నారు.​ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అస్సాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల స్థానిక ప్రజల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో పాయింట్ల వారీగా వివరించారు:

​1.భూగర్భజలాలుహారతి;

ఎండిపోతున్న వ్యవసాయ బోర్లు ​ఒక్క లీటరు ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 4 నుండి 5 లీటర్ల స్వచ్ఛమైన నీరు అవసరమవుతుంది. ఇప్పుడు రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తి అంటే, రోజువారీగా సుమారు 15 లక్షల లీటర్ల భూగర్భ జలాలను తోడేస్తారు. దీనివల్ల ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. భవిష్యత్తులో తాగునీటికి కూడా కరవు వచ్చి, ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.

​2. 'డిస్టిలరీ వ్యర్థాల'తో జల కాలుష్యం – రోగాల బారిన ప్రజలు

​ఇథనాల్ తయారీ ప్రక్రియలో మిగిలిపోయే వ్యర్థ రసాయన ద్రవాలు భూమిలోకి ఇంకిపోతుండటం వల్ల చుట్టుపక్కల బావులు, బోర్ల నీరు పూర్తిగా రంగు మారి, దుర్వాసన వస్తోంది. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల స్థానికులకు కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు , మరియు జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.

​3. గాలిలో విష వాయువులు – శ్వాసకోశ వ్యాధులు

​పరిశ్రమల నుండి వచ్చే కుళ్లిన వాసన కిలోమీటర్ల దూరం వ్యాపించడంతో ప్రజలు ఇళ్లల్లో ప్రశాంతంగా జీవించలేరు, భోజనం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలోని బాయిలర్ల పొగగొట్టాల నుండి వచ్చే కార్బన్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు సూక్ష్మ ధూళి కణాలు , 3 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి రోజుకి సుమారు 225 టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలవడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులకు ఆస్తమా, బ్రాంకైటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

​4 శబ్ద కాలుష్యం – రాత్రి పూట నిద్రలేని గ్రామాలు

​భారీ టర్బైన్లు, క్రషింగ్ మిషన్లు, బాయిలర్లు 24 గంటలూ పనిచేయడం వల్ల నిరంతరం వచ్చే భారీ శబ్దాలతో గ్రామాల్లోని ప్రజలు, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు నిద్రలేమితో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

​5. వ్యవసాయం, పశుగ్రాసం నాశనం

​ఫ్యాక్టరీ నుండి వచ్చే బూడిద చుట్టుపక్కల ఉన్న పంట పొలాలపై పేరుకుపోవడం వల్ల పంట దిగుబడి దారుణంగా పడిపోతోంది. అభివృద్ధి పేరిట పచ్చని పంట పొలాలను శ్మశానాలుగా మార్చవద్దని సూర్యచంద్ర హెచ్చరించారు.

​స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ , నవీన్ విన్నపం!

​"ఎమ్మెల్యే శ జ్యోతుల నెహ్రూ , జ్యోతుల నవీన్ నిజంగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే.ఈనెల 14న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ సభకు హాజరుకావాలి. ఈ శబ్ద, వాయు, జల కాలుష్యాలపై, భూగర్భ జలాలు అడుగంటిపోవడంపై స్థానిక ప్రజల పక్షాన నిలబడి జ్యోతుల నెహ్రూ తన గళాన్ని విప్పాలి."

​ఒకవేళ ఎమ్మెల్యే గారు ఈ సభకు రాకుండా మొహం చాటేసినా, లేదా పోలీసులను ఉపయోగించి ప్రజలను నిర్బంధించాలని చూసినా... ఆయన అస్సాగో పరిశ్రమ యాజమాన్యానికి పూర్తిగా అమ్ముడుపోయినట్లుగా ప్రజలు భావించాల్సి ఉంటుందని సూర్యచంద్ర స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా మైకు ద్వారా14 తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపే విధంగా పరిశ్రమ పరిసర గ్రామాలైన గుమ్మల్లదొడ్డి, అచ్యుతాపురం, బావాజీ పేట, వెదురుపాక గ్రామాలలో విస్తృతమైన ప్రచారం చేసే విధంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించాలని కోరారు.తాను ఇప్పటికే ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు చేసినా అధికారులు మైకుల ద్వారా గ్రామాల్లో నేటి వరకు అవగాహన కల్పించకపోవడం చూస్తుంటే అధికారులు, ఎమ్మెల్యే, కంపెనీ వారితో కుమ్మక్కయ్యారని అర్థమవుతోందన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ సభను అస్సాగో పరిశ్రమ లోపల కాకుండా, గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో బహిరంగంగా నిర్వహించాలి. ఫ్యాక్టరీ లోపల పెట్టి మేనేజ్‌మెంట్ మనుషులతో బూటకపు సభ జరుపుతామంటే జరపనివ్వం.​అస్సాగో పరిశ్రమ వల్ల నష్టపోతున్న బాధితులు, రైతులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా శాంతియుతంగా తమ అభిప్రాయాలను తెలపడానికి 14వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ వేదిక వద్దకు ధైర్యంగా తరలిరావాలని పాటంశెట్టి సూర్యచంద్ర బాధిత గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story