Mamidikuduru: గోగన్నమఠంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ!
Mamidikuduru: మామిడికుదురు మండలం గోగన్నమఠంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు.
Mamidikuduru: గోగన్నమఠంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ!
మామిడికుదురు: డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా,రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు.
సాగి సత్యనారాయణ రాజు, అతని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. సీతారామరాజు మన ప్రాంతానికి చెందిన మహానుభావుడు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
కేవలం 20 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి, అడవుల్లోకి వెళ్లి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి అని తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే అతి చిన్న వయసులో గిరిజనుల కోసం సాయుధ పోరాటం చేసిన నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. అల్లూరి కేవలం విప్లవకారుడే కాకుండా యోగి, సన్యాసి, గొప్ప గాంధేయవాది అని అభివర్ణించారు.
మహనీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం మాత్రమే కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని, అల్లూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశసేవకు, సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవిస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, నామన రాంబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




