Amaravati: ఛాంపియన్స్ కప్–2026: ప్లేయర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం!
Amaravati: ఛాంపియన్స్ కప్–2026 క్రీడా పోటీలకు సంబంధించి 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల ప్లేయర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
అమరావతి: ఛాంపియన్స్ కప్–2026 క్రీడా పోటీలకు సంబంధించిన ప్లేయర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా క్రీడా శాఖ అధికారీ కె పోతురాజు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో, నమోదు ప్రక్రియ, పాటించాల్సిన సూచనలు, పూర్తి మార్గదర్శకాలపై రూపొందించిన వీడియోను క్రీడా శాఖ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చేపట్టే అధికారులు, క్రీడాకారులు వీడియోను పూర్తిగా వీక్షించి అందులో సూచించిన విధానాన్నే అనుసరించాలని సూచించారు.
ఈ పోటీల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా, బాక్సింగ్ తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించబడనున్నాయి.
అండర్-17 (బాలురు, బాలికలు), అండర్-23 (బాలురు, బాలికలు) విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది.
ప్లేయర్ రిజిస్ట్రేషన్ కోసం https://sports.ap.gov.in/#/home/index ను సందర్శించవచ్చు. జిల్లాలకు చెందిన అర్హులైన క్రీడాకారులందరి రిజిస్ట్రేషన్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు కోరారు.
ఇప్పటికే SAAP వెబ్‌సైట్, సమ్మర్ క్యాంప్, SAAP కోచింగ్ లేదా అసోసియేషన్ గేమ్స్ ద్వారా ప్లేయర్‌గా నమోదు అయిన వారికి ఆధార్ OTP ధృవీకరణ అవసరం లేదని, వారు నేరుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అయితే తొలిసారి నమోదు చేసుకునే కొత్త క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ OTP ధృవీకరణ పూర్తి చేసిన తరువాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.




