Chintoor: చింతూరులో రోడ్డు ప్రమాదాలకు చెక్.. డిసెంబర్ నుంచి తనిఖీలు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్ డిసెంబర్ నుంచి కఠిన తనిఖీలు ఉంటాయన్నారు.
Chintoor: చింతూరులో రోడ్డు ప్రమాదాలకు చెక్.. డిసెంబర్ నుంచి తనిఖీలు!
చింతూరు: చింతూరు డివిజన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీవో, చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్ తెలిపారు.సోమవారం ఆయన డీఎస్పీ ఉదయ్ పావని, సీఐ, తహశీల్దార్, ఎన్హెచ్ ఏఈ తదితర అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రోడ్ల పరిస్థితి, వెడల్పు, సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులను పరిశీలించి, ప్రమాదాలకు కారణాలను గుర్తించారు.బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట భద్రతా మెరుగుదలలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వాహనదారులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ ఉండాలని స్పష్టం చేశారు.
లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేనివారు 15 రోజుల్లోగా ఆర్టీఓ కార్యాలయం ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు.డిసెంబర్ నుంచి పోలీస్, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, వేగ పరిమితి పాటించడం, మద్యం తాగి వాహనం నడపకపోవడం, మొబైల్ వాడకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
“మీ భద్రత - మీ కుటుంబ భవిష్యత్తు. నియమాలు పాటించండి, ప్రాణాలను కాపాడండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




