Malikipuram: చించినాడ బ్రిడ్జి మిస్టరీ వీడింది: యువకుడు సేఫ్!
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద బైక్, లేఖ వదిలి అదృశ్యమైన యువకుడు దారపురెడ్డి తరుణ్ కుమార్ సురక్షితంగా దొరికాడు.
Malikipuram: చించినాడ బ్రిడ్జి మిస్టరీ వీడింది: యువకుడు సేఫ్!
మలికిపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో బైక్‌ను చించినాడ బ్రిడ్జి వద్ద వదిలి, లేఖ రాసి అదృశ్యమైన యువకుడు దారపురెడ్డి తరుణ్ కుమార్ క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
సఖినేటిపల్లిలంకలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న తరుణ్ కుమార్ ఆదివారం రాత్రి లేఖ రాసి, తన బైక్‌ను చించినాడ బ్రిడ్జి వద్ద వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బైక్ బ్రిడ్జి వద్ద కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తరుణ్ కుమార్ శివకోడులోని ఓ పెట్రోల్ బంకు వద్ద సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు.
అనంతరం మంగళవారం తరుణ్ కుమార్‌ను మలికిపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా ఎదురైన కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని భావించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
తరుణ్ కుమార్ సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.




