Chintoor: రేపే తేలనున్న భవితవ్యం... బ్యాలెట్ బాక్స్ లో దాగిన విజేత ఎవరు?
Chintoor: చింతూరు డివిజన్‌లో 4 జడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం. ఉత్కంఠగా అభ్యర్థులు, రాజకీయ వర్గాలు.
Chintoor: రేపే తేలనున్న భవితవ్యం... బ్యాలెట్ బాక్స్ లో దాగిన విజేత ఎవరు?
చింతూరు: చింతూరు డివిజన్ లో పోటీకి దిగిన అభ్యర్థుల భవితవ్యం రేపే తేలనుంది. బ్యాలెట్ బాక్స్ లో నిద్రపోతున్న ఓట్లు రేపు ఉదయం లెక్కింపుకు నోరు విప్పనున్నాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ పీక్స్ కు చేరింది. గెలుస్తామా? ఓడిపోతామా? అనే టెన్షన్ తో నాయకులకు కంటి మీద కునుకు లేదు.చింతూరు డివిజన్ లోని కూనవరం, వీఆర్ పురం, ఎటపాక, చింతూరు మండలాల్లో మొత్తంగా 39 ఎంపీటీసీ స్థానాలకు, 4 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మండలాల వారీగా చూస్తే.. చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, ఎటపాక మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, కూనవరంలో 8 ఎంపీటీసీ స్థానాలు, వీఆర్ పురంలో 7 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు పోటీకి దిగారు.ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. గడప గడపకు తిరిగారు. హామీల వర్షం కురిపించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డారు.
ఓటర్లు కూడా తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉన్నాయి. రేపు ఆ బాక్సులు తెరిచి ఓట్లను లెక్కించి అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.ఈ పోటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందుతాడు? ఎవరి వ్యూహం ఫలించింది? ఎవరి లెక్క తప్పింది? అనే ప్రశ్నలతో ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
కొందరు అభ్యర్థులు ఇప్పటికే గెలుపు ఖాయమని ధీమాతో ఉంటే.. మరికొందరు హోరాహోరీ పోరులో ఫలితం చివరి రౌండ్ వరకు తేలదని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రేపు చింతూరు డివిజన్ లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. విజేతల సంబరాలు, ఓటమి పాలైన వారి నిరాశ.. రేపు అంతా కళ్ల ముందు కనిపించనుంది. ఇక వేచి చూడాల్సిందే.. రేపు ఉదయం బ్యాలెట్ బాక్స్ ఏం చెబుతుందో..!




