Chintoor: చింతూరులో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని యువకుడు మృతి!

Chintoor: చింతూరులోని అటవీశాఖ గెస్ట్ హౌస్ వద్ద ఆదివారం వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ప్రమాదంలో చింతరేగిపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రాజ్ కుమార్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 15 Nov 2026 3:35 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని యువకుడు మృతి!

చింతూరు: ఒకరు దేవుడి దర్శనానికి బయలుదేరారు.. మరొకరు స్నేహితుడికి తోడుగా బయలుదేరారు. కానీ గమ్యం చేరకముందే విధి వారి దారికి అడ్డుగా లారీ రూపంలో వచ్చింది. ఒక్క క్షణం.. ఒక్క నిర్ణయం.. ఇద్దరి జీవితాలను రెండుగా విడదీసింది. వీఆర్ పురం మండలం చింతరేగిపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రాజ్ కుమార్ (22) తన స్నేహితుడు దుర్గాప్రసాద్ తో కలిసి ఆదివారం పొల్లూరు గ్రామంలోని ధారాలమ్మ గుడికి బైక్ పై బయలుదేరాడు.

చింతూరులోని అటవీశాఖ గెస్ట్ హౌస్ ముందుకు చేరుకోగానే ఒడిశా నుంచి చింతూరు వైపు వేగంగా వస్తున్న లారీ వారి బైక్ వైపు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని గమనించిన ఇద్దరూ బైక్ నుంచి దూకేశారు. కానీ అదే వారి జీవితాలను మార్చేసింది. దుర్గాప్రసాద్ రోడ్డు బయట వైపుకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్ కుమార్ మాత్రం పొరపాటున లారీ వస్తున్న వైపుకే దూకాడు. అంతే.. లారీ టైరు అతని తల మీదుగా వెళ్లిపోయింది. తల నుజ్జునుజ్జు కావడంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

స్నేహితుడు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో దుర్గాప్రసాద్ షాక్ కు గురయ్యాడు. సమాచారం అందుకున్న చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గుడికి వెళ్లి తిరిగి వస్తాడనుకున్న కొడుకు శవమై తిరిగి రావడంతో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR