Amalapuram: భూ రీ-సర్వే పనుల వేగవంతంపై కలెక్టర్ సీరియస్!
Amalapuram: కలెక్టర్ అమలాపురంలో రీ-సర్వే పనులపై సమీక్షించి, వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష్యాలన్నీ పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
Amalapuram: భూ రీ-సర్వే పనుల వేగవంతంపై కలెక్టర్ సీరియస్!
అమలాపురం: జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశాలు జిల్లాలో రీ-సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.రీ-సర్వే పురోగతి, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ,ఈ-కేవైసీ నమోదు, మ్యూటేషన్లు,సబ్‌డివిజన్ల పరిష్కారం తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో గోదావరి భవన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్, ఆర్‌డీవోలు,తహసీల్దార్లు,జిల్లా సర్వే శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రీ-సర్వే కార్యక్రమంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రతి గ్రామంలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ,సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.తహసీల్దార్లు ప్రతిరోజూ సాయంత్రం తమ పరిధిలోని విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలతో సమావేశాలు నిర్వహించి గ్రామాల వారీగా పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు.
ప్రతి గ్రామంలో పూర్తయిన సర్వేలు,పెండింగ్ పనులు,వాటి కారణాలు,పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర సమీక్ష జరిపి,సమస్యలు పేరుకుపోకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.రీ-సర్వే ప్రక్రియలో లైన్ ఆఫ్ కమాండ్‌ను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జాయింట్ కలెక్టర్ లేదా ఇతర ఉన్నతాధికారులు నేరుగా కింది స్థాయి సిబ్బందితో మాట్లాడాల్సిన పరిస్థితి రాకుండా తహసీల్దార్లే పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ప్రతి అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తే లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు.ఆర్‌డీవోలు ప్రతి రెండు రోజులకు ఒకసారి తమ డివిజన్ పరిధిలో జరుగుతున్న రీ-సర్వే పనులను సమగ్రంగా సమీక్షించి,పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా వెనుకబాటు ఉంటే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.
జులై,సెప్టెంబర్ తదితర సైకిళ్లకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, సబ్‌డివిజన్లు,కోర్టింగ్, ఈ-కేవైసీ నమోదు,మ్యూటేషన్లకు సంబంధించిన పెండింగ్ అంశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి అంశానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి,ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ వచ్చే ఫిబ్రవరి నాటికి జిల్లాకు నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ,రీ-సర్వే కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న కార్యక్రమమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.గ్రామ స్థాయిలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ఈ-కేవైసీ నమోదు,మ్యూటేషన్లు, సబ్‌డివిజన్లు,పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియలను ప్రత్యేక దృష్టితో పూర్తిచేయాలని ఆదేశించారు.
తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు,విలేజ్ సర్వేయర్లు,వీఆర్వోలు ప్రతిరోజూ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల వారీగా రీ-సర్వే పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.రోజువారీ సమీక్షల్లో పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి,వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.సమీక్షా సమావేశంలో డిఆర్ఓ వి సుబ్బారావు,జిల్లా సర్వే శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




