Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ మహేష్

Amalapuram: కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జేసీ ఖోమ్.నైడియా దేవితో కలిసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 12 Oct 2026 9:26 PM IST
Amalapuram
X

Amalapuram: స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ మహేష్

అమలాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో,పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్.నైడియా దేవి తో కలిసి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మానవ వనరుల అంచనా,పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూమ్‌లు,రిసెప్షన్ కేంద్రాలు,ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.సిబ్బంది అవసరాలపై సమగ్ర అంచనా జిల్లాలో గ్రామ పంచాయతీలు,ఎంపీటీసీ, జెడ్పీటీసీ,పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది వివరాలను సమగ్రంగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు),ప్రిసైడింగ్ అధికారులు (పీవోలు), ఇతర పోలింగ్ సిబ్బంది,రూట్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందితోపాటు అవసరమైన సహాయక సిబ్బంది వివరాలను ముందుగానే సేకరించాలన్నారు.ప్రతి మండలానికి అవసరమైన సిబ్బందిని గుర్తించి, అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలతో పోల్చి చూడాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురైనా విధులకు ఆటంకం కలగకుండా సుమారు పది శాతం రిజర్వ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.మూడు రకాల ఎన్నికలకు అవసరమయ్యే గరిష్ట సిబ్బంది సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. సిబ్బంది కేటాయింపులో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా శాఖల వారీగా, మండలాల వారీగా వివరాలను క్రోడీకరించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బంది కేటాయింపు

జిల్లాలోని సుమారు నాలుగు వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా సిబ్బంది కేటాయింపునకు అవసరమైన వివరాలను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 200 లోపు ఓటర్లు ఉన్న కేంద్రాలు,200 నుంచి 500 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలు, 500 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను వర్గీకరించి,ఆయా కేంద్రాలకు నిర్దేశిత నిబంధనల ప్రకారం సిబ్బందిని కేటాయించేందుకు జాబితాలు రూపొందించాలన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ల సంఖ్య,సిబ్బంది అవసరాలు,విధుల కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సిబ్బంది కొరత తలెత్తకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

విడతల వారీగా ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక

గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఒక విడతలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందిని తదుపరి విడతలో అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా విధుల మార్పిడి, డ్యూటీల షఫులింగ్‌పై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా సిబ్బంది అందుబాటు,విధుల కేటాయింపు,శిక్షణ,ఎన్నికల సామగ్రి పంపిణీ వంటి అంశాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి దశలో బాధ్యతలు ఎవరు నిర్వహించాలి,ఏయే కేంద్రాలకు ఎంతమంది సిబ్బంది అవసరం అనే అంశాలపై స్పష్టత ఉండాలన్నారు.ఎన్నికల నిర్వహణలో సమయం వృథా కాకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.

స్ట్రాంగ్‌రూమ్‌లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు,పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణ కేంద్రాలు,స్ట్రాంగ్‌రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.కొత్తపేట, రామచంద్రపురం,అమలాపురం తదితర ప్రాంతాల్లో గుర్తించిన కేంద్రాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని సూచించారు.

కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు,బారికేడింగ్, రాకపోకలకు అనువైన మార్గాలు,ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం సామగ్రి స్వీకరణ,ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతకు సంబంధించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ) ఏర్పాటు,వాటి విధులు, పర్యవేక్షణ బాధ్యతలపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

అవసరమైన ప్రాంతాల్లో సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు సంబంధించి పోలీసు శాఖతో చర్చించి నివేదిక రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు,ఇతర ప్రలోభాల నియంత్రణతోపాటు ఎన్నికల నియమావళి అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.సంబంధిత బృందాలకు అవసరమైన సిబ్బంది,వాహనాలు,ఇతర సదుపాయాలపై ముందస్తు అంచనా రూపొందించాలన్నారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ తప్పనిసరి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు విధుల నిర్వహణపై సమగ్ర శిక్షణ అందించాలని కలెక్టర్ ఆదేశించారు.పోలింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి వారి బాధ్యతలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన నియమాలు,పోలింగ్ నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన చర్యలు, ఓట్ల లెక్కింపు విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ను ముందుగానే సిద్ధం చేసి, సంబంధిత సిబ్బందికి నిర్ణీత సమయంలో అందించాలని తెలిపారు. విధులకు హాజరయ్యే సిబ్బందికి తమ బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని, శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించాలి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఎన్నికల సామగ్రి స్వీకరణ, స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత,ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశకు సంబంధించిన ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖల అధికారులు తమ పరిధిలోని ఎన్నికల ఏర్పాట్ల వివరాలను క్రోడీకరించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు , అమలాపురం కొత్తపేట ఆర్డీవోలు ఎం సరళాదేవి జీవివి సత్యనారాయణ అమలాపురం ముమ్మిడివరం రామచంద్రాపురం మున్సిపల్ కమిషనర్లు ఎం నిర్మల్ కుమార్ రామరాజు ఆర్ఆర్ రాజు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారిని పి విజయలక్ష్మి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM