Rampachodavaram: జూలై 14తో ముగియనున్న‘ఎస్‌ఐఆర్’ మీ ఓటు చెక్ చేసుకున్నారా?

Rampachodavaram: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూలై 14 లోపు ప్రతి ఓటరూ తమ పేరును సరిచూసుకోవాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ కోరారు.

Prasanna, Rampachodavaram
Published on: 11 July 2026 10:52 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: జూలై 14తో ముగియనున్న‘ఎస్‌ఐఆర్’ మీ ఓటు చెక్ చేసుకున్నారా?

రంపచోడవరం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంలో ప్రతి ఓటరూ చురుకుగా పాల్గొని, ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో స్వయంగా నిర్ధారించుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసి, ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఓటరూ బీఎల్‌వోలను కలిసి తమకు అందించిన ఎన్యూమరేషన్ ఫారమ్ (EF)ను పూర్తిగా నింపి తిరిగి అందజేయాలని సూచించారు.

ఓటర్ల జాబితాలో పేర్లు ఖచ్చితంగా, తాజా వివరాలతో ఉండటమే ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు కాకుండా చూడటం, మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

జూలై 14తో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో మిగిలిన సమయం అత్యంత కీలకమని, ప్రతి ఓటరూ నిర్లిప్తత వీడి వెంటనే స్పందించి తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన, తప్పులులేని ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రతి ఓటరి సహకారం ఎంతో అవసరమన్నారు.

ఇంటి నుంచే ఎస్‌ఐఆర్ నమోదు అవకాశం

బీఎల్‌వోను నేరుగా కలిసే అవకాశం లేని ఓటర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ECI Voters Portalలో తమ EPIC (ఓటరు గుర్తింపు కార్డు) నంబర్ నమోదు చేసి వ్యక్తిగత వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు.

అలాగే "Book a Call to BLO" సదుపాయాన్ని వినియోగించి బీఎల్‌వో సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరూ సద్వినియోగం చేసుకుని జూలై 14లోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story