Gopalapuram: గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Gopalapuram: గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ. మౌలిక వసతులు, వైద్య సేవలపై ఆరా. విద్యుత్ సమస్య పరిష్కారానికి హామీ.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 9 July 2026 4:16 PM IST
Gopalapuram
X

Gopalapuram: గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

గోపాలపురం: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ముఖాముఖిగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది స్పందన, మందుల లభ్యత, చికిత్స నాణ్యత వంటి అంశాలపై వివరాలు సేకరించారు.

అనంతరం ప్రసూతి వార్డును సందర్శించిన కలెక్టర్ బాలింతలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని సేవలను సమర్థవంతంగా అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రం అందుబాటులో ఉన్నప్పటికీ టెక్నీషియన్ లేకపోవడంతో సేవలు నిలిచిపోయాయని, తక్షణమే టెక్నీషియన్‌ను నియమించి ప్రజలకు ఎక్స్‌రే సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేలా వైద్యులు, ఏఎన్‌ఎంలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో గోపాలపురం తహసీల్దార్ జి. మహాలక్ష్మి, ఎంపీడీవో రాజ్ మనోహర్, రాజమహేంద్రవరం పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ రొంగాల సత్యనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బురెడ్డి వాసు, జ్యేష్ఠ శ్రీధర్, సీడీపీఓ మమ్మీ, వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story