Rajahmundry: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీఎల్వోల పాత్ర అత్యంత కీలకం
Rajahmundry: రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో రాజమండ్రి రూరల్, అర్బన్ ప్రాంతాల బూత్ లెవెల్ ఆఫీసర్ల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) శిక్షణ సదస్సు జరిగింది.
Rajahmundry: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీఎల్వోల పాత్ర అత్యంత కీలకం
Rajahmundry: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ప్రాంతాల బీఎల్వోల కోసం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారి (రూరల్ తహసీల్దార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్‌ను ఎంత సమగ్రంగా నిర్వహిస్తే, అంత తక్కువ సంఖ్యలో క్లెయిమ్స్, అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి బీఎల్వో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని సూచించారు. డోర్ లాక్ ఉన్న ఇళ్ల వద్ద నోటీసులు జారీ చేయడంతో పాటు, తదుపరి సందర్శన తేదీని తెలియజేయాలని, ఆ నోటీసులో ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వో ఫోన్ నంబర్లు కూడా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించి, ఎన్యుమరేషన్ ప్రక్రియ నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు 2002 ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, అప్పట్లో నిర్వహించిన సమగ్ర ధృవీకరణ ప్రక్రియ ద్వారా సిద్ధమైన ఓటరు జాబితా విశ్వసనీయ ప్రాతిపదికగా నిలిచిందన్నారు. అదే ప్రమాణాలను ఆధారంగా తీసుకుని 2026లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
భారత పౌరసత్వం కలిగి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారమని పేర్కొన్నారు. అందుకే ఓటరు జాబితా ఖచ్చితత్వం విషయంలో రాజీకి తావులేదన్నారు. ఆధార్ కార్డు కేవలం చిరునామా ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల ఆధారంగా అర్హతలను పరిశీలించాలని వివరించారు.
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా పెరుగుదల, వలసల కారణంగా ఓటర్ల వివరాల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్లను కేటగిరీల వారీగా గుర్తించి డేటా సిద్ధం చేయడం ద్వారా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయ వచ్చన్నారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్ నమోదులను ముందుగానే గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఓటరు జాబితాలపై అనవసర ఆరోపణలకు తావు లేకుండా బీఎల్వోలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని, అసంబద్ధ కారణాలు చూపకుండా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని మేఘా స్వరూప్ సూచించారు. "హార్డ్ వర్క్ మేక్స్ పర్‌ఫెక్ట్" అనే సూత్రంతో ప్రతి బీఎల్వో పనిచేయాలని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ నియోజక వర్గ ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆ హక్కును పరిరక్షించడంలో బీఎల్వోలు కీలక భాగస్వాములని తెలిపారు.
ఈ సందర్భంగా బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటింటి సర్వే సమయంలో తరచుగా గృహాలు తాళం వేసి ఉండటం, వలసల కారణంగా ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదురుకావడం, మరణించిన ఓటర్ల వివరాల నిర్ధారణలో ఆలస్యం,
కొంతమంది ఓటర్లు అవసరమైన పత్రాలు అందించడంలో సహకరించకపోవడం వంటి అంశాలను వివరించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అద్దెకు నివసించే వారి వివరాల సేకరణ, అపార్ట్‌మెంట్‌లలో ప్రవేశ అనుమతులు పొందడం, చిరునామా మార్పులకు సంబంధించిన ధృవీకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వగా, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ కె. చైతన్య, బీఎల్వో శిరీష్‌లు ఎస్‌ఐఆర్ బీఎల్వో మాడ్యూల్ ఆధారంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ, క్షేత్రస్థాయి ధృవీకరణ విధానాలు, క్లెయిమ్స్-అభ్యంతరాల పరిష్కార విధానాలపై సవివరంగా అవగాహన కల్పించారు.




