Amalapuram: విదేశాలకు వెళ్లే వారు కేసీఎంను సంప్రదించాలి నోడల్ అధికారి
Amalapuram: మస్కట్‌లో చిక్కుకున్న రాజోలు మహిళ రాజకుమారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించిన కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల మరియు కేసీఎం బృందం.
Amalapuram: విదేశాలకు వెళ్లే వారు కేసీఎంను సంప్రదించాలి నోడల్ అధికారి
అమలాపురం: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు గ్రామానికి చెందిన ఆర్. రాజకుమారిని మస్కట్ నుంచి సురక్షితంగా భారతదేశానికి రప్పించడంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల కీలక పాత్ర పోషించారు.
కుటుంబ పోషణ కోసం రాజకుమారి ఈ ఏడాది మార్చి 17న నారాయణరావు అనే ఏజెంట్ ద్వారా మస్కట్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడ అధిక పని గంటలు, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి, పనిచేయలేని స్థితికి చేరుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పరిచయస్తుల సూచన మేరకు అమలాపురం కలెక్టరేట్‌లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసీఎం అధికారులు సంబంధిత ఏజెంట్‌తో పాటు ఇతర వర్గాలతో సమన్వయం చేసి, కుటుంబ సభ్యుల సహకారంతో రాజకుమారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి. సుబ్బారావు మాట్లాడుతూ, విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లే వారు తప్పనిసరిగా కేసీఎంను సంప్రదించి సరైన అవగాహనతో, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే వెళ్లాలని సూచించారు.
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సమన్వయకర్త గోళ్ళ రమేష్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం నిరంతరం సేవలు అందిస్తోందని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.




