Kothapeta: కొత్తపేటలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!
Kothapeta: కొత్తపేటలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.
Kothapeta: కొత్తపేటలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్!
కొత్తపేట: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల వద్ద పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మహేష్ కుమార్ రావిరాల అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి భద్రతతో పాటు ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
నామినేషన్లు, అప్పీళ్లపై అధికారులతో సమీక్ష
కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో దాఖలైన ఎంపీటీసీ నామినేషన్లు, వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన నామినేషన్లు, వాటికి సంబంధించి దాఖలైన అప్పీళ్లు తదితర అంశాలపై కొత్తపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమీక్షించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు.
స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల క్షేత్రస్థాయి పరిశీలన
అనంతరం కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను కలెక్టర్ ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలకు సంబంధించి కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలకు సంబంధించి కొత్తపేటలోని వి.కె.వి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జి.వి.వి. సత్యనారాయణ, రోడ్లు మరియు భవనాల శాఖ జిల్లా అధికారి బి. రాము, సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎస్. మురళీ మోహన్, డి.ఎల్.డి.ఓ సురేష్ కుమార్, కొత్తపేట తహసీల్దార్ వై. రాంబాబు, ఎంపీడీఓ పి. కృష్ణారెడ్డి, మండల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




