Amalapuram: కలెక్టరేట్ సమీక్షలో కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు!
Amalapuram: అమలాపురంలో క్వాయర్ పరిశ్రమల అభివృద్ధిపై సమీక్షించి, జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు జియో-టెక్స్టైల్స్ వినియోగించాలని ఆదేశించారు.
Amalapuram: కలెక్టరేట్ సమీక్షలో కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు!
అమలాపురం: క్వాయర్ (తేనెపీచు) పరిశ్రమలను ప్రోత్సహించి, పర్యావరణహిత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడం ద్వారా జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ఉద్యాన శాఖ అధికారులు, బ్యాంకర్లతో కలిసి క్వాయర్ పరిశ్రమల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు క్వాయర్ రంగం ఎంతో దోహదపడుతుందని అన్నారు. రోడ్లు, ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖల్లో ప్లాస్టిక్‌కు బదులుగా జియో-టెక్స్టైల్స్ వంటి క్వాయర్ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
క్వాయర్ రంగ అభివృద్ధికి మార్కెటింగ్, సాంకేతికత, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి యువత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని తెలిపారు.
మహిళల సాధికారత కోసం MEDP కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణలు నిర్వహించి, బ్యాంకింగ్, జీఎస్టీ, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్వాయర్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి క్వాయర్ రంగం కీలకమని, అందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి, ఉద్యాన శాఖ అధికారి బి.వి. రమణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కుమార్ వర్మ, నాబార్డ్ ఏజీఎం వై.ఎస్. నాయుడు తదితరులు పాల్గొన్నారు.




