Rampachodavaram: ప్రధాన రహదారుల విస్తరణకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు!

Rampachodavaram: ప్రధాన కేంద్రంలో ట్రాఫిక్ నివారణకు ₹26 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రహదారుల విస్తరణకు కలెక్టర్ కె. దినేష్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Prasanna, Rampachodavaram
Published on: 28 July 2026 8:14 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: ప్రధాన రహదారుల విస్తరణకు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు!

రంపచోడవరం: పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో పెరుగుతున్న ట్రాఫిక్, అత్యవసర సేవల రాకపోకలు మరియు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.

ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, పలు ఉన్నత పాఠశాలలు, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ వంటి ముఖ్య ప్రభుత్వ సంస్థలు ఉన్న ఈ ప్రధాన రహదారి మార్గాలలో రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు.

ప్రత్యేకంగా అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మరియు ఇతర అత్యవసర సేవల వాహనాల సంచారం ఇరుకైన రహదారుల కారణంగా ఆలస్యమవుతోందని కలెక్టర్ వివరించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను ఇప్పటికే తొలగించినట్లు కూడా నివేదికలో తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులను నాలుగు లేన్లకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ పనుల కోసం తొలి దశకు ₹15.00 కోట్లు, మలి దశకు ₹11.00 కోట్లు అంచనా వ్యయం రెండు దశల్లో మొత్తం ₹26.00 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత విభాగాల ద్వారా సవివర అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలియజేస్తూ, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story