Amalapuram: ప్రత్యేక ప్రచార దినాల్లో ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రచార దినాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
Amalapuram: ప్రత్యేక ప్రచార దినాల్లో ఓటర్ల క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ!
అమలాపురం: అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలి.ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision of Photo Electoral Rolls–2026) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి క్లెయిమ్స్,అభ్యంతరాలను స్వీకరించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ఎన్నికల సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, వెలగపూడి,అమరావతి వారు జారీ చేసిన ఆదేశాల మేరకు ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ రోజుల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (BLOలు),రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించడంతో పాటు క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు BLOలు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదు ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హత కలిగిన పౌరులు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం సూచించింది.ఇప్పటికే ఓటర్ల జాబితాలో నమోదైన పేర్లలో పేరు,వయస్సు,చిరునామా, ఫోటో తదితర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటి సవరణకు క్లెయిమ్ సమర్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో అర్హత లేని వ్యక్తులు, మరణించిన వ్యక్తులు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు స్థలాంతరం చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే సంబంధిత అభ్యంతరాలను అధికారులకు సమర్పించాలని సూచించారు.
కుటుంబ సభ్యుల పేర్లను కూడా పరిశీలించాలి.ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు కోరారు.తమ వివరాలతో పాటు కుటుంబ సభ్యులు, అర్హత కలిగిన ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని సూచించారు.ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు లేదా లోపాలు గుర్తించినట్లయితే సంబంధిత BLOను సంప్రదించి అవసరమైన క్లెయిమ్ లేదా అభ్యంతరాన్ని సమర్పించాలని తెలిపారు.ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలి. సక్రమమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని జిల్లా ఎన్నికల యంత్రాంగం పేర్కొంది.
అర్హత కలిగిన ప్రతి పౌరుడు ప్రత్యేక ప్రచార దినాల్లో చురుకుగా పాల్గొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరింది.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన క్లెయిమ్స్, అభ్యంతరాలను సంబంధిత BLOల ద్వారా సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు ఆగస్టు 22, 23 తేదీల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే BLOలు,BLO సూపర్వైజర్లపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన విధి అయినందున సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ప్రత్యేక ప్రచార దినాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఎలక్టోరల్ అధికారి జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి ఆధ్వర్యంలో EROలు, AEROలు,అదనపు AEROలు, మండల ప్రత్యేక అధికారులు, BLO సూపర్వైజర్లు,బూత్ లెవెల్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేశారు.




