Razole: రాజోలులో ఘనంగా గుఱ్ఱం ధర్మోజీ రావు 9వ సంస్మరణ సభ!

Razole: రాజోలులో డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీ రావు 9వ సంస్మరణ సభ ఘనంగా నిర్వహణ. కవులకు సత్కారాలు, సాహిత్య సేవలపై స్మరణ.

PRABHU, RAZOLE
Published on: 21 Jun 2026 12:34 PM IST
Razole
X

Razole: రాజోలులో ఘనంగా గుఱ్ఱం ధర్మోజీ రావు 9వ సంస్మరణ సభ!

రాజోలు: పద్య సాహిత్యానికి ప్రాణం పోసి, సామాజిక చైతన్యానికి కలాన్ని ఆయుధంగా మలిచిన మహోన్నత ఉదాహరణ కావ్యాల పద్యకవి డాక్టర్ గుఱ్ఱం ధర్మోజీ రావు స్మృతులు సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు లోని డాక్టర్. బీ.ఆర్ .అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్‌ లో గుఱ్ఱం ధర్మోజీ రావు 9వ సంస్మరణ సభను దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, గుఱ్ఱం ధర్మోజీ రావు కవిత్వం కేవలం పదాల సమాహారం కాదని, అది సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఆయన రచనలు మానవతా విలువలకు అద్దం పట్టడమే కాకుండా, సమానత్వ భావజాలాన్ని తరతరాలకు చాటిచెప్పాయని కొనియాడారు.

సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందించిన పద్యకవులు, వచన కవులకు స్మారక పురస్కారాలు, నగదు పారితోషికాలు అందజేసి సత్కరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విచ్చేసిన దళిత కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కవులు తమ కవిత్వం ద్వారా సామాజిక స్పృహ, మానవీయ విలువలు, దళిత చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ సభకు ప్రత్యేక శోభను చేకూర్చారు.

అనంతరం కవులను ఘనంగా సత్కరించి, గుఱ్ఱం ధర్మోజీరావు సాహిత్య సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రొఫెసర్ చిలుకోటి కూర్మయ్య, డాక్టర్ బండి సత్యనారాయణ, డాక్టర్ గూటం స్వామి, డాక్టర్ తంగిరాల సోనీ, పొలమూరి శ్యాంబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చిలకపాటి శ్రీధర్, తెన్నేటి కిషోర్,బొంతు మణిరాజు,లిఖితపూడి బుజ్జి, బొడ్డపల్లి ప్రసాద్, మందపాటి మధు, గోగి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సాహిత్యం ద్వారా సమాజ మార్పును సాధించాలనే గుఱ్ఱం ధర్మోజీరావు ఆశయాలను కొనసాగించడం ప్రతి రచయిత బాధ్యత అని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story