Amalapuram: పీ4 కార్యక్రమం విద్యార్థినికి ఆర్థిక సాయం అందించిన డాక్టర్

Amalapuram: కూటమి ప్రభుత్వం పీ4 కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థిని హారికకు రూ.25 వేల ఆర్థిక సాయం, యూనిఫాం అందజేసిన క్యాపిటల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయకుమార్.

SURESH, AMALAPURAM
Published on: 13 Aug 2026 9:07 PM IST
Amalapuram
X

Amalapuram: పీ4 కార్యక్రమం విద్యార్థినికి ఆర్థిక సాయం అందించిన డాక్టర్

అమలాపురం: పీ4 కార్యక్రమానికి విశేష స్పందన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ పీ4 కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం క్యాపిటల్ హాస్పిటల్ డాక్టర్ విజయకుమార్ ఔదార్యం. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకిగా మారిన ఓ విద్యార్థినికి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు,క్యాపిటల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయకుమార్ అండగా నిలిచారు.

చదువును కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం పత్తిగొంది గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని శీలం హారికకు రూ.25 వేల ఆర్థిక సహాయంతో పాటు స్కూల్ యూనిఫాం,షూస్ అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.శీలం హారిక మల్లవరం పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదల కలిగిన హారిక ఉన్నతంగా చదువుకోవాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతోంది.

అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాఠశాల ఫీజులు,యూనిఫాం,పుస్తకాలు,ఇతర విద్యా అవసరాలకు సంబంధించిన ఖర్చులను భరించడం కుటుంబానికి భారంగా మారింది.దీంతో చదువును కొనసాగించడంలో హారిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్వచ్ఛంద సేవకుల దృష్టికి వచ్చింది.కాకినాడకు చెందిన స్వచ్ఛంద సేవకుడు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సతీష్ హారిక కుటుంబ పరిస్థితులనుతెలుసుకున్నారు.

విద్యార్థినికి చదువుపై ఉన్న ఆసక్తి,కుటుంబ ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన ఆయన ఈ విషయాన్ని డాక్టర్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.హారిక పరిస్థితిని తెలుసుకున్న డాక్టర్ విజయకుమార్, ఆర్థిక కారణాలతో విద్యార్థిని చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో తన తల్లి జ్ఞాపకార్థం గా తక్షణమే తనవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.ఈ మేరకు అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో హారికకు రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అంతేకాకుండా నూతన స్కూల్ యూనిఫాం,షూస్‌ను కూడా అందించి విద్యార్థినిని ప్రోత్సహించారు.చదువుకు అవసరమైన ఖర్చుల విషయంలో కుటుంబానికి కొంత ఊరట కల్పించడంతో పాటు హారికలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ సహాయం నిలిచింది.ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ, తాను కూడా ఎన్నో కష్టాలను అధిగమించి చదువుకొని ఆర్థోపెడిక్ వైద్యుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చదువుకునే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తనకు తెలుసన్నారు.ప్రతిభ,ఆసక్తి ఉన్న విద్యార్థులు కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదని పేర్కొన్నారు.తన తల్లి ఆశయాన్ని నెరవేర్చే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేకపోతున్న విద్యార్థులను గుర్తించి, తనవంతుగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని డాక్టర్ విజయకుమార్ తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత సహకారం అందించాలని కోరారు.ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల లక్ష్యాలకు ఎప్పటికీ అడ్డంకిగా మారకూడదని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని హారికతో పాటు విద్యార్థులందరికీ సూచించారు.డాక్టర్ విజయకుమార్ అందించిన ఆర్థిక సహాయం,స్కూల్ యూనిఫాం,షూస్‌తో హారిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

తమ పరిస్థితిని అర్థం చేసుకుని చదువుకు చేయూత అందించిన డాక్టర్ విజయకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా హారిక కుటుంబ పరిస్థితులను గుర్తించి, ఆమెకు అవసరమైన సహాయం అందేలా డాక్టర్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లిన కాకినాడకు చెందిన స్వచ్ఛంద సేవకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సతీష్‌ను పలువురు అభినందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థిని పరిస్థితిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు,దాతల సహకారాన్ని అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఒక విద్యార్థిని చదువు ఆగిపోకుండా ఆర్థిక సహాయం అందించడం,అవసరమైన విద్యా సామగ్రిని సమకూర్చడం ద్వారా డాక్టర్ విజయకుమార్ మానవతా విలువలను చాటారని పలువురు కొనియాడారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచి,ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని డాక్టర్ ఆకాంక్షించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story