Kadiyam: కడియం జడ్పీటీసీ పోరు: బీజేపీ, జనసేన హోరాహోరీ!

Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియం జడ్పీటీసీ సీటుపై బీజేపీ, జనసేన మధ్య తీవ్ర పోరు. ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 26 Oct 2026 12:36 AM IST
Kadiyam
X

Kadiyam: కడియం జడ్పీటీసీ పోరు: బీజేపీ, జనసేన హోరాహోరీ!

కడియం: ​తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు ప్రస్తుతం కడియం జడ్పిటిసి స్థానం చుట్టూ గిరికీలు కొడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉండి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్న తరుణంలో... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కడియం జడ్పిటిసి స్థానం మిత్రపక్షాల మధ్య ‘మహా సంగ్రామం’ క్రీడాస్థలిగా మారింది. అసలు ఈ స్థానం మాదంటే మాదని ఇరు పార్టీలు చేస్తున్న ప్రకటనలు, నామినేషన్ల పర్వం కూటమి శ్రేణుల్లో తీవ్ర అయోమయాన్ని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

​సీటు కోసం చెరోదారి.. కడియంలో పొలిటికల్ రణరంగం.....

​రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కడియం జడ్పిటిసి స్థానంపై ఇటు బీజేపీ, అటు జనసేన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

​భారీ అంచనాలతో బీజేపీ....

రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీలో కీలక నేత అయిన ‘చిన్నమ్మ’గా అభివర్ణించే పెద్దమ్మయిన దగ్గుబాటి పురందేశ్వరి మొదటి నుంచీ ఈ స్థానాన్ని బీజేపీ ఖాతాలోనే వేయాలని పట్టుదలగా ఉన్నారు. ఆమె వ్యూహంలో భాగంగానే కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్, సీనియర్ నేత ఆకుల శ్రీధర్ బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.

​అమాత్యుని పంతం..

మరోవైపు జిల్లాలో చక్రం తిప్పుతున్న జనసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మద్దతుతో జనసేన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. రత్నం అయ్యప్ప చిరు సేవా సమితి అధ్యక్షులు గడ్డం శివరత్న గణపతి (రత్నం అయ్యప్ప) చేత జనసేన నామినేషన్ వేయించారు. మంత్రి దుర్గేష్ స్వయంగా ఈ అభ్యర్థికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆయన నామినేషన్‌కూ అండగా నిలిచారు.

​ఒకచోట కూటమిగా కలిసి పనిచేయాల్సిన ఇరు పార్టీలు, క్షేత్రస్థాయిలో మాత్రం ఒకరిపై ఒకరు అభ్యర్థులను బరిలోకి దించి హోరాహోరీ ప్రచారం చేస్తుండటంతో క్యాడర్ ఏ దారిలో నవాలో తెలియక సతమతమవుతోంది.

​'ఉమ్మడి ధర్మం' ఏది? బీజేపీ ఆవేదన....

​కడియం మండలంలో కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీల మధ్య 'ఉమ్మడి ధర్మం' అమలు కావడం లేదనేది స్థానిక బీజేపీ శ్రేణుల ప్రధాన వాదన. ​ధవళేశ్వరం, వేమగిరి ప్రాంతాల్లోని ఇసుక ర్యాంపుల నిర్వహణలోనూ, ఇతర ఆర్థికాంశాల్లోనూ తెలుగుదేశం, జనసేన భాగస్వామ్యంతో నడుస్తున్నాయని, తమను మాత్రం ఎక్కడా సంప్రదించలేదని కడియం బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

​తాము ఎవరి వద్దకు వెళ్లి ఆర్థిక లబ్ధి కోరలేదని, కానీ కూటమి ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపులో, అభివృద్ధిలో మాత్రం తమకు దక్కాల్సిన న్యాయమైన వాట దక్కాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

​ఈ క్రమంలోనే ఆత్మగౌరవ ప్రతీకగా జడ్పిటిసి స్థానంపై బీజేపీ గట్టి పట్టుపట్టిందని రాజకీయావర్గాల్లో చర్చ జరుగుతోంది.

​ఉత్కంఠ రేపుతున్న 'బీ-ఫార్మ్' రాజకీయం

​నామినేషన్ల పర్వం ముగిసి ఉపసంహరణ గడువు ముక్కున వేేసుకునే సమయం దగ్గరపడుతున్నా, ఈ సీటు ఏ పార్టీకి అధికారికంగా కేటాయిస్తారనే దానిపై హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడం గమనార్హం.

​ఒకవైపు ఎంపీ పురందేశ్వరి తన పట్టు నిలుపుకుని బీజేపీకే బీ-ఫార్మ్ దక్కేలా హైకమాండ్ స్థాయిలో మంతనాలు సాగిస్తున్నారా?

​లేక మంత్రి హోదాలో ఉన్న కందుల దుర్గేష్ తన పంతం నెగ్గించుకుని జనసేన అభ్యర్థికే ఖరారు చేయించుకుంటారా?

​అనేది ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరి వ్యూహం ఫలించనుంది? కేంద్ర నాయకత్వం వద్ద పురందేశ్వరి పట్టు చెల్లుతుందా? లేక స్థానిక మంత్రి కందుల దుర్గేష్ పంతం నెగ్గుతుందా? తెలియాలంటే కూటమి పెద్దల తుది నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL