Devarapalli: దేవరపల్లి వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
Devarapalli: గౌరీపట్నం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Devarapalli: దేవరపల్లి వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
తూర్పు గోదావరి జిల్లా: దేవరపల్లి మండలం గౌరీపట్నం శివారులోని పెట్రోల్ బంకుల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా వస్తున్న కోళ్ల మేత లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి అంబులెన్స్ సాయంతో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రాజమహేంద్రవరం–జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఈ ప్రమాదంపై స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌరీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీలకు భారీ లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల రహదారిపై మట్టి, బురద పేరుకుపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి జారుడుగా మారి వాహనాలు అదుపుతప్పే పరిస్థితులు నెలకొంటున్నాయని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారిని వెంటనే శుభ్రపరచడంతో పాటు క్వారీ లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు




