Konaseema: కోనసీమలో కలకలం రేపిన కల్తీ మద్యం వ్యవహారం!
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగంలో వైన్ షాప్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. యానాం మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Konaseema: కోనసీమలో కలకలం రేపిన కల్తీ మద్యం వ్యవహారం!
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామంలో సుదీర్ఘకాలంగా సాగుతున్న మద్యం మాఫియా గుట్టు ఎట్టకేలకు రట్టయింది. స్థానిక ‘వైన్ షాప్’ నిర్వాహకులు యానాం నుంచి చవకైన మద్యాన్ని అక్రమంగా తరలించి, ఇక్కడి బ్రాండెడ్ సీసాల్లో నింపి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 58 యానాం మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపును సీజ్ చేసి, బాధ్యులైన ముగ్గురిని అరెస్ట్ చేశారు..
నలువైపులా అడ్డదారుల ‘మాగం’.. పోలీసుల కళ్లుగప్పి దందా!
ఈ గ్రామానికి నలువైపులా రహదారులు ఉండడం, చెక్ పోస్టులు కళ్ళు గప్పి వచ్చే వీలుండటంతో ఇది అక్రమార్కులకు వరంగా మారింది. పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు చిక్కకుండా యానాం నుంచి విచ్చలవిడిగా మద్యాన్ని గ్రామానికి తరలిస్తూ, ఇక్కడ సీసాలు మార్చి అమాయక మందుబాబులకు బ్రాండెడ్ పేరుతో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల ఉదాసీనత వెనుక మర్మమేంటి?
కేవలం మద్యం కల్తీ దందాయే కాకుండా, ఈ వైన్ షాప్ నిర్వాహకులు గ్రామంలో చెలరేగిపోతున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. షాపు ఎదురుగా ఉన్న పంట బోదెను సైతం ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపట్టారు.
ఆ స్థానంలో అక్రమంగా పార్కింగ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక రైతులు ప్రశ్నించినా స్పందించే అధికారే లేరు.
ఇన్నాళ్లూ కళ్లెదుటే ఆక్రమణలు, కల్తీ మద్యం వ్యాపారం సాగుతున్నా ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరించారు? ఇప్పుడంటే పక్కా సమాచారంతో దాడులు చేసి చేతులు దులుపుకున్నారు కానీ, ఈ ఆక్రమణలపై, వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేక మళ్లీ పాతకథే పునరావృతమవుతుందా అని ప్రజాసంఘాలు,
గ్రామస్తులు నిలదీస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.




