Mamidikuduru: గ్రామదేవత ఉత్సవాల్లో మెరిసిన ఫ్యాషన్ ఐకాన్ నిహారిక!
Mamidikuduru: పాశర్లపూడిలంక చింతాలమ్మ జాతరలో జాతీయ స్థాయి ఫ్యాషన్ ఐకాన్ నిహారిక తెలగారెడ్డి సందడి చేశారు. స్థానిక గ్రామస్థులు ఆమెను ఘనంగా సత్కరించారు.
Mamidikuduru: గ్రామదేవత ఉత్సవాల్లో మెరిసిన ఫ్యాషన్ ఐకాన్ నిహారిక!
మామిడికుదురు: అందం, అభినయం, క్రీడలు, సంప్రదాయ కళల్లో ప్రతిభ కనబరుస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఫ్యాషన్ ఐకాన్ నిహారిక తెలగారెడ్డి సోమవారం మామిడికుదురు మండలం, పాశర్లపూడిలంకలో సందడి చేశారు. గ్రామదేవత చింతాలమ్మ జాతర సందర్భంగా ఆమె గ్రామాన్ని సందర్శించగా, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఫ్యాషన్ రంగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నిహారిక, మిస్ టీన్ గార్జియస్ ఆఫ్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో పాటు మిస్ ఉత్తరాంధ్ర, మిస్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా టైటిళ్లను గెలుచుకున్నారు. అలాగే ప్రతిష్టాత్మక మిస్ వైజాగ్ గ్లోబ్ పోటీల్లో టాప్-5లో నిలిచి విశేష గుర్తింపు సాధించారు.
గ్లామర్ రంగానికే పరిమితం కాకుండా శాస్త్రీయ నృత్యకారిణిగా కూడా నిహారిక తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాశీ, తిరుపతి సహా దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవస్థానాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
కళలతో పాటు క్రీడారంగంలోనూ ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిభావంతమైన బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా పాసర్లపూడిలంక గ్రామస్తులు నిహారికను ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె రాకతో గ్రామంలో జాతర వేడుకలు మరింత ఉత్సాహభరితంగా సాగి పండుగ వాతావరణం నెలకొంది.




