Kadiyam: కోటి రూపాయల అభివృద్ధి విరాళం సర్పంచ్ పదవికి మాజీ జర్నలిస్ట్ వినూత్న ఆఫర్!

Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళలో సర్పంచ్ ఎన్నికలపై మాజీ జర్నలిస్ట్ తోకల శ్రీనివాస్ వినూత్న ప్రకటన. గ్రామాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. కోటి అభివృద్ధి విరాళం.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 11 Nov 2026 12:20 PM IST
Kadiyam
X

Kadiyam: కోటి రూపాయల అభివృద్ధి విరాళం సర్పంచ్ పదవికి మాజీ జర్నలిస్ట్ వినూత్న ఆఫర్!

Kadiyam: ​గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్ పదవి వరకు కోట్లలో ఖర్చు చేయడం, ఓటర్లకు డబ్బులు, కానుకలు పంచడం నేటి రాజకీయాల్లో సాధారణమైపోయింది. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు దుళ్ళ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్.

మాజీ పాత్రికేయుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా ప్రజలతో మమేకమైన ఆయన, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ సాహసోపేతమైన ప్రకటన చేశారు.

​ప్రకటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?..

​ఎన్నికల పోటీ అంటేనే అభ్యర్థులకు ఆర్థికంగా భారంగా మారుతున్న తరుణంలో, ప్రచారానికి పెట్టే ఖర్చు, అనవసరమైన ఆర్భాటాలను పూర్తిగా నివారించవచ్చని శ్రీనివాస్ వాదిస్తున్నారు.

దుళ్ళ గ్రామాన్ని రాజకీయ కక్షలకు, వర్గపోరుకు అతీతంగా ఏకగ్రీవం చేసుకుంటే—ఎన్నికల ప్రక్రియలో జరిగే అనవసర ఖర్చులు ఆగిపోవడంతో పాటు, తన వంతుగా వ్యక్తిగతంగా రూ. కోటి రూపాయలను పంచాయతీ అభివృద్ధి నిధికి విరాళంగా అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.

​ఈ మొత్తం డబ్బును గ్రామంలోని మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, సీసీ రోడ్లు మరియు ఇతర సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం పూర్తిగా వెచ్చిస్తానని ఆయన భరోసా ఇస్తున్నారు.

​జర్నలిజం నుంచి ప్రజాసేవ వరకు..

​తోకల శ్రీనివాస్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒకప్పుడు పాత్రికేయుడిగా (జర్నలిస్ట్) ప్రజల సమస్యలపై గళం ఎత్తిన వ్యక్తి. సమాజంలో వేర్లునుంచి మార్పు రావాలంటే గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి ప్రారంభం కావాలని ఆయన నమ్ముతారు.

పాత్రికేయ వృత్తి ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన అనుభవం ఉండటం వల్ల, గ్రామ సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అలాగే గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు పరిపాలనలో శ్రీరామరక్షగా నిలవనుంది.

​గ్రామస్థుల హర్షం - రాజకీయ వర్గాల్లో చర్చ...

​తోకల శ్రీనివాస్ ప్రకటనపై దుళ్ళ గ్రామ ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్పంచ్ అభ్యర్థి తన పదవి కోసం డబ్బులు పంచడం చూశాము కానీ, గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయలు సొంతంగా ఇస్తానని ముందుకు రావడం నిజంగా అరుదైన విషయమని స్థానికులు కొనియాడుతున్నారు.

​మరోవైపు, ఈ ప్రకటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయాలను వ్యాపారంగా కాకుండా, నిజమైన సేవగా భావించే వారికి ఇలాంటి ఆలోచనలు ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుళ్ళ గ్రామం కనుక ఈ ప్రతిపాదనను అంగీకరించి ఏకగ్రీవానికి ముందుకు వస్తే, ఇది రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామాలకు కూడా ఒక రోల్ మోడల్ (ఆదర్శం)గా నిలిచే అవకాశం ఉంది.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL