Rajahmundry: డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగే వరకు పోరాటం: మాజీ ఎంపీ!

Rajahmundry: రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతికి నిరసనగా సోమవారం విద్యాసంస్థల బంద్‌కు మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 9 Aug 2026 10:44 PM IST
Rajahmundry
X

Rajahmundry: డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగే వరకు పోరాటం: మాజీ ఎంపీ!

రాజముండ్రి: జి ఎస్ ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతి పట్ల రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి మార్గాన్ని భరత్ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు రోజుల క్రితం ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మెడికల్ కాలేజీ మెడికో డాక్టర్ ప్రియాంకపై ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని, దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈ రోజు తుదిశ్వాస విడవడం చాలా బాధాకరమని అన్నారు.

ప్రియాంక తండ్రి ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ ఇలా ఎవరు తమ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం పర్సనల్ స్పందించి ఆమె ఆసుపత్రి చికిత్సకు అయినా ఖర్చు తో పాటు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని మార్గాన్ని భరత్ డిమాండ్ చేశారు. ఇంతటి తీవ్రమైన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.

ముఖ్యంగా ప్రకాష్ నగర్ సీఐ ఈ ఘటనను కేవలం ప్రమాదంగా నమోదు చేసి, నిందితులకు స్టేషన్ బెయిల్ లభించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం/సంబంధిత కఠిన నేరాల కింద కేసులు నమోదు చేయాలి, కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రకాష్ నగర్ సీఐ పాత్రపై సమగ్ర విచారణ జరిపి, తప్పిదం నిర్ధారణైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగేలా చేయడం మనందరి కనీస కర్తవ్య మని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన సందేశం ఇవ్వడానికే, రేపు సోమవారం రాజమండ్రిలోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు మార్గాన్ని భరత్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ బంద్‌కు సహకరించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగే వరకు వైసిపి పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story