Rajahmundry: దేశంలో విస్తరిస్తున్న పేగు గాయాలు డాక్టర్ గోపి ఆందోళన!
Rajahmundry: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న IBD పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గోపి శ్రీకాంత్ హెచ్చరించారు.
Rajahmundry: దేశంలో విస్తరిస్తున్న పేగు గాయాలు డాక్టర్ గోపి ఆందోళన!
Rajahmundry: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబిడి) తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఆచార్యుడిగా సేవలందించి, జీర్ణకోశ, కాలేయ రుగ్మతలు, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చికిత్సల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ స్పెషలిస్ట్ గోపి శ్రీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు.
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో పదేపదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలామంది సాధారణ పైల్స్ లేదా ఇన్ఫెక్షన్ గా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడి పరిస్థితి విషమిస్తోందని వివరించారు.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నిర్వహించిన జాతీయ అధ్యయనం ప్రకారం మనదేశంలో లక్ష జనాభాకు సగటున 2.34 రేటుతో దాదాపు 31,800 కొత్త ఐబిడి కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
1990తో పోలిస్తే ప్రస్తుతం బాధితుల సంఖ్య రెట్టింపై దాదాపు 2.7 లక్షలకు చేరింది. అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రధాన రకాలతో కూడిన ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ కబలిస్తోంది.
జన్యుపరమైన మూలాలు, రోగనిరోధక వ్యవస్థలోని లోపాలు, ప్రేగులలోని బ్యాక్టీరియా ప్రతిస్పందనల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. కారమైన పదార్థాలు, తీవ్ర ఒత్తిడి వల్ల లక్షణాలు ఎక్కువ కావచ్చు తప్ప అవి నేరుగా వ్యాధికి కారణం కావు.
ధూమపానం వల్ల క్రోన్స్ డిసీజ్ కాంప్లికేషన్లు మరింత తీవ్రమవుతాయి.వారం రోజులకు మించి విరేచనాలు కావడం, రాత్రిపూట విరేచనాల కావడం, మలంలో జిగురు లేదా రక్తం పడటం, విపరీతమైన కడుపునొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, రక్తహీనత, నిరంతర అలసట, పిల్లల్లో ఎదుగుదల లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
సాధారణ ఐబిఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) తో పోలిస్తే ఐబిడి ప్రేగులలో కొలవదగిన వాపును, నిర్మాణపరమైన నష్టాన్ని కలిగిస్తుంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోతే రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం, పేగులు కుంచించుకుపోవడం, ఫిస్టులాలు, కురుపులు ఏర్పడటమే కాకుండా అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమవుతాయి.
రక్త, మల పరీక్షలతో పాటు ఫీకల్ కాల్‌ప్రొటెక్టిన్, బయాప్సీతో కూడిన కొలొనోస్కోపీ, సీటీ లేదా ఎంఆర్ ఐమేజింగ్ ద్వారా వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చు. మనదేశంలో బయోలాజిక్ చికిత్సలు ప్రారంభించే ముందు క్రోన్స్ డిసీజ్ ను పేగు క్షయవ్యాధి (టిబి) నుంచి వేరు చేయడం అత్యంత కీలకం.
ప్రాసెస్డ్ ఫుడ్ పరిమితం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం, వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకపోవడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చు. ఒకసారి వ్యాధి బారిన పడినవారు లక్షణాలు తగ్గినప్పటికీ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, కొలొనోస్కోపిక్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.
వ్యాధి తీవ్రత, రోగి వయస్సును బట్టి 5-అమినోసాలిసిలేట్స్, స్వల్పకాలిక కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్లు, అడ్వాన్స్డ్ బయోలాజిక్స్, టార్గెటెడ్ ఓరల్ థెరపీలతో పాటు అత్యవసర వేళల్లో శస్త్రచికిత్సల ద్వారా వ్యాధిని అదుపు చేయవచ్చు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ జీర్ణకోశ విభాగం సకల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన సంరక్షణను అందిస్తూ సంక్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా చికిత్స చేస్తోంది.
విపరీతమైన కడుపునొప్పి, వాంతులు, అధిక జ్వరం, గ్యాస్ పోకపోవడం వంటి అత్యవసర లక్షణాలు ఉన్నవారు వెంటనే అత్యవసర వైద్య విభాగాన్ని ఆశ్రయించాలి. ఈ పాత్రికేయ సమావేశంలో సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి ఎస్.వి. రామకృష్ణ పాల్గొన్నారు.




