Vilasa: జెడ్పీ స్కూల్లో ఘనంగా భానోజీ రామర్స్ విగ్రహ ఆవిష్కరణ!

Vilasa: విలాస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థలదాత కీర్తిశేషులు జిల్లెల్ల భానోజీ రామర్స్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.

RAJU, P GANNAVARAM
Published on: 14 July 2026 11:46 PM IST
Vilasa
X

Vilasa: జెడ్పీ స్కూల్లో ఘనంగా భానోజీ రామర్స్ విగ్రహ ఆవిష్కరణ!

విలాస: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, విలాస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థలదాత కీర్తిశేషులు శ్రీ జిల్లెల్ల భానోజీ రామర్స్ విగ్రహాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యపై అపారమైన అభిరుచి కలిగిన మహోన్నత వ్యక్తి శ్రీ జిల్లెల్ల భానోజీ రామర్స్ కొనియాడారు. "అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది" అనే భావనతో, ఆ రోజుల్లోనే ఈ పాఠశాల కోసం 1.7 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం వారి గొప్ప దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. అలాగే అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాల కోసం 24 ఎకరాల భూమిని కేటాయించడం వారి విద్యాసేవకు మరో గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకొని గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడా విద్యనే ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా ఎదిగారని గుర్తు చేస్తూ, విద్యార్థులందరూ కష్టపడి చదివి తమ గ్రామానికి, మండలానికి, రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అలాగే కీర్తిశేషులు శ్రీ జిల్లెల్ల భానోజీ రామర్స్ ఆరో కుమారుడు శ్రీ వెంకట శ్రీనివాస్ రామర్స్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను సభలో వివరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు మరియు నిర్వాహకులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story