Rampachodavaram: గోదావరి ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Rampachodavaram: గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏపీలోని ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ హెచ్చరించారు.

Prasanna, Rampachodavaram
Published on: 31 July 2026 8:24 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: గోదావరి ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Rampachodavaram: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. పైప్రాంతాల నుంచి రానున్న రెండు రోజుల్లో సుమారు 9.3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, ఇంకా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున వచ్చే నాలుగు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

గురువారం రాత్రి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వరద పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, శుక్రవారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక (43 అడుగులు), ఎల్లుండి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని నీటిమట్టం తాకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇంకా నీటిమట్టాలు పెరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు, ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

జిల్లా స్థాయిలో డీఆర్‌ఓ ఆధ్వర్యంలో వరద పరిస్థితుల పర్యవేక్షణ జిల్లా కేంద్రం నుంచి కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. చింతరేగుపల్లి, రామవరం, శ్రీరామవరం, కూనవరం గ్రామాలతో పాటు వి.ఆర్.పురం మండలంలోని మొత్తం 39 గ్రామాలను ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు చెప్పారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పడవలను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే 16 ప్రాంతాలను ముంపు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని, పెట్రోల్, డీజిల్ నిల్వలను కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

24×7 అప్రమత్తంగా ఉండాలి – అన్ని శాఖలకు కలెక్టర్ ఆదేశాలు

వరద పరిస్థితిని 24 గంటలపాటు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధిపతులు ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రిలీఫ్ చర్యల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు.

లోతట్టు, వల్నరబుల్ మరియు ప్రమాద ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, వరద సెన్సిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రిలీఫ్ కేంద్రాల వద్ద జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర సరుకులను సమృద్ధిగా నిల్వ చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

వైద్య, ఐసీడీఎస్, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక చర్యలు

వైద్యశాఖ పాము కాటు మందులు, అవసరమైన రక్త నిల్వలు, అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఐసీడీఎస్ సిబ్బంది గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులపై ప్రత్యేక సర్వే నిర్వహించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆర్ & బి శాఖ వంతెనలు, రహదారుల పరిస్థితిని పరిశీలించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఫిషరీస్ శాఖ అనుబంధ రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వ్యవసాయ శాఖ నష్ట నివారణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, పౌర సరఫరా శాఖ నిత్యావసర సరుకుల లభ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. ఎటువంటి మానవ, పశు నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభమ్ నోఖ్వాల్ మాట్లాడుతూ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పెరుగుతోందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు.

అత్యవసర సంప్రదింపు నంబర్లు

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సబ్ కలెక్టర్: 9490026397, 8121729228

కూనవరం: 9652814712

వి.ఆర్.పురం: 7893946774

చింతూరు: 9492527695

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story