Gokavaram: గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్వో ప్లాంట్ ప్రారంభం
Gokavaram: గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సొంత నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన కంబాల శ్రీనివాసరావు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన వెల్లడి.
Gokavaram: గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్వో ప్లాంట్ ప్రారంభం
గోకవరం: తనకు జన్మనిచ్చిన గోకవరం గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, విశ్వహిందూ దర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు అన్నారు. ప్రయాణికులు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
ప్రజా సేవే పరమావధిగా భావిస్తున్న కంబాల శ్రీనివాసరావు, గోకవరం ప్రాంత ప్రజలకు, ప్రతిరోజూ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం తన సొంత నిధుల నుంచి రూ.3 లక్షలు విరాళాన్ని అందజేసి, ఈ ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసారు. తొలిత ఆయనకు ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది, కార్మికులు, ఘన స్వాగతం పలికి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, బస్టాండ్ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, కార్మికులు, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోకవరంలోనే కాకుండా కోరుకొండ, జగ్గంపేట రాజానగరం, సీతానగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.
అలాగే గోకవరం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గుబ్బాలమ్మ ఆలయం వద్ద భారీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అదే విధంగా గోకవరం గ్రామ ప్రజల అత్యవసర సమయంలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తానని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో, ఈ ఆర్వో ప్లాంట్ వారి దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యకరమైన తాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూ, విద్య, వైద్యం, తాగునీరు, దేవాలయాల అభివృద్ధి వంటి రంగాల్లో తనవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నానని తెలిపారు.
తాను పుట్టి, పెరిగిన గోకవరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేసిన కంబాల శ్రీనివాసరావుకి రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, గోకవరం ఆర్టీసీ మేనేజర్ సుచరిత, సిబ్బంది, కార్మికులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




