Gokavaram: ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ప్రధాన లక్ష్యం - డిఎం అజయ్ బాబు

Gokavaram: గోకవరం ఆర్టీసీ డిపో పరిధిలో బస్సుల కొరతను త్వరలో అధిగమిస్తామని తెలిపిన డిఎం అజయ్ బాబు. ప్రయాణికుల భద్రతే ధ్యేయమని వెల్లడి.

NARAYANA, RAJANAGARAM
Published on: 12 Sept 2026 6:46 PM IST
Gokavaram
X

Gokavaram: ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ప్రధాన లక్ష్యం - డిఎం అజయ్ బాబు

గోకవరం: ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ అజయ్ బాబు తెలిపారు. శనివారం గోకవరం ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన సమావేశమై డిపో పరిధిలోని ఆర్టీసీ సేవలు, బస్సుల కొరత, ప్రయాణికుల సమస్యలపై వివరాలు వెల్లడించారు.

ప్రస్తుతం గోకవరం డిపో పరిధిలో 37 ఆర్టీసీ బస్సులు, 13 అద్దె బస్సులు కలిపి మొత్తం 50 బస్సులతో సర్వీసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 35 వేల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు సురక్షితంగా చేరవేస్తున్నామని చెప్పారు.

బస్సుల కొరత కారణంగా ఇటీవల కొన్ని సర్వీసులను కుదించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం బస్సుల కొరత ఉన్న మాట వాస్తవమేనని, ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

త్వరలో రాజమహేంద్రవరం డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, అనంతరం అక్కడి నుంచి డీజిల్ బస్సులను గోకవరం డిపోకు తరలించే అవకాశం ఉందని చెప్పారు. అలా జరిగితే బస్సుల కొరత కొంతవరకు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉన్న బస్సులతోనే అదనపు ట్రిప్పులు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రూట్లను సర్దుబాటు చేస్తూ సర్వీసులు నిర్వహిస్తున్నామని డీఎం తెలిపారు. రంపచోడవరం మార్గాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, గతంలో ఐదు బస్సులతో 15 ట్రిప్పులు నిర్వహించేవారమని, ప్రస్తుతం మూడు బస్సులతోనే 16 ట్రిప్పులు నడుపుతున్నామని వివరించారు.

నిర్లక్ష్యంపై చర్యలు

అద్దె బస్సుల డ్రైవర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ, అలాంటి ఘటనలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అజయ్ బాబు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.

పోలవరం జిల్లా బాధ్యతలు గోకవరం డిపోపై

నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లా పరిధిలో ఆర్టీసీ సేవల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు తమ డిపోపై ఉన్నాయని డీఎం తెలిపారు. పోలవరం ప్రాంతంలో కొత్త ఆర్టీసీ డిపో ఏర్పాటుకు సంబంధించి ఇటీవల ఒక కమిటీ వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లిందని చెప్పారు. భవిష్యత్‌లో కొత్త డిపో ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అజయ్ బాబు తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM